ఖాకీల ఓవరాక్షన్‌.. నిమజ్జనం ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

ఖాకీల ఓవరాక్షన్‌.. నిమజ్జనం ఆలస్యం

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

రొద్దం: వినాయక విగ్రహాల శోభాయాత్ర సజావుగా, సకాలంలో పూర్తి చేసేందుకు నియమించిన పోలీసుల వల్లే నిమజ్జనం ఆలస్యమైంది. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అర్ధరాత్రి నుంచి రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేయడంతో సీఐ శేఖర్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించారని ఆందోళన

రొద్దంలో 11 రోజులు పూజలందుకున్న వినాయక విగ్రహాలను గురువారం నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నుంచి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. అయితే శోభాయాత్ర సాగుతున్న సమయంలో ఓ కానిస్టేబుల్‌ తమతో దురుసుగా ప్రవర్తించారని, త్వరగా ముగించాలని తమపై ఒత్తిడి తెస్తూ నెట్టివేశాడని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ భక్తులు, కమిటీ సభ్యులు పావగడ–పెనుకొండ ప్రధాన రోడ్డుపై బైఠాయించి పోలీసుల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న సీఐ శేఖర్‌ ఉదయం రొద్దం చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పడంతో కమిటీ సభ్యులు, భక్తులు ధర్నా విరమించారు. అనంతరం పోలీసు బందోబస్త్‌ నడుమ శుక్రవారం ఉదయం మళ్లీ వినాయక శోభాయాత్ర ప్రారంభించారు. అనంతరం రొద్దం పెద్దచెరువులో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

పోలీసుల ప్రవర్తనపై

గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యుల ఆగ్రహం

గురువారం అర్ధరాత్రి నుంచి

ఉదయం వరకూ రోడ్డుపైనే బైఠాయింపు

సీఐ శేఖర్‌ క్షమాపణ చెప్పడంతో

శుక్రవారం ఉదయం నిమజ్జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement