ధర్మవరం: పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శుక్రవారం ఎస్పీ సతీష్‌కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రూ.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథరాజు, టూటౌన్ సీఐ జయనాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల
జిల్లా కార్యదర్శుల నియామకం
కనగానపల్లి: రాప్తాడు నియోజక వర్గానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులకు శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిగా ఉప్పర శ్రావణ్, జిల్లా రైతు విభాగం కార్యదర్శిగా కె. ఉదయ్‌కుమార్‌రెడ్డి, బీసీ సెల్ కార్యదర్శులుగా బోయ మనోహర్, కురుబ ఆనంద్, వైఎస్సార్‌టీయూసీ కార్యదర్శిగా జి. ఉమేష్, సోషియల్ మీడియా వింగ్ కార్యదర్శిగా సాకే నరేష్, యూత్ విభాగం కార్యదర్శిగా బాల నరసింహారెడ్డి, లీగల్ సెల్ కార్యదర్శిగా గంగాద్రిని నియమించారు. అలాగే రాప్తాడు మండల కమిటీలో కూడా అనుబంధ విభాగాల కార్యదర్శులను నియమించారు. ఇందులో రాప్తాడు మండల కమిటీ కార్యదర్శులుగా రామ్మోహన్‌రెడ్డి, పశుపుల సోమశేఖర్, బీసీ సెల్ విభాగం కార్యదర్శులుగా రామచంద్ర, నరేష్, మనోహర్, రైతు విభాగం కార్యదర్శిగా విష్ణు కంచిరెడ్డి, మైనారిటీ సెల్ కార్యదర్శులుగా ఎస్. భాషా, జబీవుల్లా, వైఎస్సార్‌టీయూసీ కార్యదర్శిగా పీ. సుబ్రమణ్యంను నియమించారు.
రొళ్ల ఇన్‌చార్జ్ ఎంపీడీఓ తొలగింపు
రొళ్ల: ఫోర్జరీ వ్యవహారంలో ఇరుక్కున్న రొళ్ల ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావును ఉన్నతాధికారులు ఆస్థానం నుంచి తప్పించారు. తిరిగి ఆయన్ను మడకశిర ఏఓగా పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఇటీవల 16వ ఆర్థిక సంఘం నిధుల మంజూరుకు సంబంధించి రూ. 97,78,080 నిధుల ప్రతిపాదనల దస్త్రాలపై స్థానిక ఎంపీపీ ఎస్.ఆర్.సుమ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత మాజీ ఎంపీపీ సుమ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఉమ్మడి అనంతపురం జడ్పీ సీఈఓలకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఎంపీపీ సంతకం ఫోర్జరీ ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు మెడికల్ లీవ్ ముగించుకుని విధుల్లో చేరిన రెగ్యులర్ ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రికి తిరిగి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
రెండిళ్లలో చోరీ
హిందూపురం టౌన్: పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. టూటౌన్ ఎస్‌ఐ లక్ష్మీప్రసన్న వివరాల మేరకు.. మోడల్‌కాలనీలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ రోషన్ వలీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీ జరిగింది. ఇంట్లోని 32.5 గ్రాముల బంగారం, 126 గ్రాముల వెండి, రూ.10 వేల వరకు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
లక్ష్మీపురంలో..
పట్టణంలోని లక్ష్మీపురంలో నివాసముంటున్న హరినాథ్‌రెడ్డి ఇంట్లో చోరి జరిగింది. పనినిమిత్తం ఆయన అనంతపురానికి వెళ్లగా.. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని రూ.2 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి చోరీకి గురైనట్లు బాధితుడి పేర్కొన్నారు. అయితే ఈ ఈ ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
నలుగురికి జరిమానా
ధర్మవరం అర్బన్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ నలుగురికి రూ.40 వేలు జరిమానా విధించినట్లు టూటౌన్ సీఐ జయనాయక్ తెలిపారు. పట్టణంలో గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పరీక్షించామన్నారు. ఇద్దరు కారు డ్రైవర్లు, ఇద్దరు ఆటో డ్రైవర్లు మద్యం తాగినట్లు తేలడంతో నలుగురిపై కేసులు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. కోర్టులో జడ్జి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నలుగురికి రూ.40 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు.


