నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము | - | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

పరిగి: ఇంట్లో ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి నిద్రిస్తున్న మహిళను పాము కాటువేసింది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. వివరాల్లోకి వెళితే... మండలంలోని కాలువపల్లికి చెందిన బోయ రామాంజనమ్మ(45), ఆంజనేయులు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం కూలి పనులకు వెళ్లిన రామాంజనమ్మ రాత్రి వేళ భోజనం చేసి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిపోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏదో కరిచినట్లు అనిపించడంతో నిద్రలేచిన రామాంజనమ్మ కుటుంబీకులను నిద్రలేపి విషయం తెలిపింది. దీంతో గది అంతా పరిశీలించగా కట్లపాము కనిపించింది. దీంతో రామంజనమ్మ భర్త ఆంజనేయులు దాన్ని చంపి వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన భార్యను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామాంజనమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

హిందూపురం టౌన్‌: రామాంజనమ్మ మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. అత్యవసర సమయంలో ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేరని, సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడం వల్లే రామాంజనమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. రామాంజనమ్మ మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలసేపు ధర్నా చేశారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆప్తాబ్‌ మాట్లాడుతూ.. పాముకాటుకు గురైన బాధితురాలికి సకాలంలో వైద్య సేవలు అందించామని, ఆమె సాధారణ స్థితిలో ఉండడంతో వార్డుకు తరలించి వైద్య సేవలు అందించామన్నారు. అయితే ఆమె భయాందోళనతో మృతి చెంది ఉంటుందన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

పోస్టుమార్టంపైనా..

రామాంజనమ్మ మృతదేహానికి పోస్టుమార్టం చేసే విషయంలోనూ వివాదం తలెత్తింది. మొదట వైద్యులు, పోలీసులు.. రామాంజనమ్మకు పాము కరిచిన చోట మాత్రమే నమూనా సేకరించి మృతదేహాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని, కానీ మొత్తం మృతదేహానికి పోస్టుమార్టం చేశారని ఆరోపిస్తూ బాధితులు ఆస్పత్రి ఎమర్జెన్సీ వద్ద బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన డాక్టర్‌, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ ప్రసాద్‌ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి పంపించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ

బాధితురాలు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement