కదిరి పట్టణంలోని రాయచోటి రోడ్డు 11 వార్డులో అల్లాబకాష్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అదే వార్డులో అబీబుల్లా మక్కా మసీదులో ఇమామ్‌గా పనిచేస్తూ 18 నెలల క్రితం మృతి చెందాడు. పట్టణంలో తేరు బజారులో 21 వార్డులో వంకాయల క్రిష్ణమూర్తి చనిపోయి ఆరేళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు వచ్చిన ఓటర్లు లిస్టులో వారి పేర్లు ఉండడం గమనార్హం. అదే విధంగా కొన్ని వార్డుల్లో ఒకేపేరుతో రెండు చోట్ల ఓటర్లు లిస్టులో పేర్లు ఉండడం కూడా విస్మయానికి గురిచేస్తోంది.
కదిరి టౌన్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం. అర్హత ఉన్న ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి. అదే సమయంలో అర్హత లేని వ్యక్తుల పేర్లు, మృతి చెందిన వారి పేర్లు కొనసాగకుండా ఎన్నికల జాబితాను కచ్చితంగా రూపొందించడం కూడా ఎన్నికల యంత్రాంగం బాధ్యత. అయితే కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ల జాబితాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో మృతి చెందిన వ్యక్తుల పేర్లు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఓటు హక్కుకు అర్హత లేని వ్యక్తులు కొత్తగా ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటికి సర్వే ఓటర్ల వివరాలు పరిశీలన ఏ ప్రాతిపదికన జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మృతుల పేర్లు ఎలా?
ఒక వ్యక్తి మరణించిన తర్వాత సంబంధిత అధికారిక రికార్డుల ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మృతుడి వివరాలపై మరణ ధ్రువీకరణ పత్రం, సంబంధిత కుటుంబ సభ్యుల సమాచారం లేకపోతే బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ) నివేదిక వంటి ఆధారాలను పరిశీలించి చర్యలు తీసుకోవచ్చు.
80,937 మంది ఓటర్లు..
కదిరి మున్సిపాలిటి పరిధిలో 39,167 మంది పురుషులు, 41,768 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. మొత్తం ఓటర్లు 80,937 మంది ఉన్నారు. అయితే చాలా వరకు ఓటరు లిస్టు తప్పుల తడకగా మారడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే వైఎస్సార్‌సీపీ అనుకూలంగా ఉన్న ప్రాంతంలో టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా ఓటరు లిస్టులను మార్చుకున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక చోట దరఖాస్తు చేసుకుంటే వేరే చోట ఓటర్ లిస్టులో పేర్లు బయట పడుతున్నాయి. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నా ఓటర్ లిస్టులో పేర్లు రాకపోవడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు లిస్టులో చనిపోయిన వారి పేర్లు
అర్హులైన వారివి తొలగించిన వైనం


