అనంతపురం సెంట్రల్: తెల్లవారుజామున మూడిళ్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు సాయంత్రానికల్లా కటాకటాల వెనక్కి పంపించారు. వన్‌టౌన్ ఎస్‌ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని బోయగేరిలో ఆదివారం తెల్లవారుజామున హరికిరణ్ కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా దొంగ చొరబడ్డాడు. హఠాత్తుగా నిద్రలేచిన వారిని ఇనుపరాడ్డుతో బెదిరించి హరికిరణ్ భార్య మెడలోని బంగారు తాళిబొట్టు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అలాగే ఎదురుగా ఉంటున్న వినేష్ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్, నాగరాజు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రాప్తాడు మండలం చిన్మయనగర్‌కు చెందిన కటిక సాయిప్రసాద్ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. ‘ఎన్‌న్‌టీఆర్ మార్గ్’లో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన వస్తువులన్నీ రికవరీ చేశారు.
రైతు ఆత్మహత్యాయత్నం
విడపనకల్లు: మండల కేంద్రానికి చెందిన ఓ రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విడపనకల్లుకు చెందిన దూదేకుల మహబూబ్ బాషా వ్యవసాయం, కుటుంబ పోషణ, పిల్లల పెళ్లిళ్ల కోసం దాదాపు రూ.60 లక్షల వరకు అప్పు చేశాడు. ఏటా పంటలు సాగు చేస్తున్నా పంటలు పండక పెట్టుబడి గిట్టుబాటు కాకపోవడంతో అప్పు తీర్చే మార్గం లేకపోయింది. ఈ ఏడాది కూడా వర్షాభావంతో పంటలు చేతికొచ్చే మార్గం కనిపించలేదు. దీనినికితోడు రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పంచాయితీ చేశాడు. తనకు కొంతకాలం గడువు ఇవ్వాలని కోరాడు. అయినా ఒత్తిళ్లు అధికమై మనస్థాపం చెందిన మహబూబ్‌బాషా శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు గమనించి అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, దీనిపై పోలీసులను అడగ్గా తమ దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.


