పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రచారంతో పట్టణాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇందులో భాగంగానే పుట్టపర్తి మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏక్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గతంలో పుట్టపర్తి పురపాలక సంఘంలో 20 వార్డులు ఉండేవి. వాటిని 28కి పెంచుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎటు చూసినా రాజకీయ చర్చ
ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో మున్సిపల్ చైర్మన్ సీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎవరికివారు తమ గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటూ తామే రేసులో బలంగా ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. హోటళ్లు, రచ్చబండల వద్ద షాపుల్లో ఏ ఇద్దరు కలిసినా మున్సిపల్ ఎన్నికలపైనే చర్చ సాగుతోంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు కావడంతో రాజకీయంగా ఈప్రాంతం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆసక్తికరంగా రిజర్వేషన్ లెక్కలు
నగర పంచాయతీగా ఉన్న పుట్టపర్తి 2011లో మున్సిపాలిటీగా మారింది. మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. అనంతరం గ్రేడ్ –2 మున్సిపాలిటీ కోసం గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎంతో కృషి చేసి సాధించారు. ప్రస్తుతం రిజర్వేషన్ల లెక్కలు కూడా ఆసక్తికరంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో చైర్మన్ సీటు జనరల్‌కు రిజర్వు కావడంతో ఇప్పడు బీసీలకు రిజర్వ్ అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
22న ఓటర్ల జాబితా ప్రకటన
ఈనెల 22న వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులను 33 మందిని నియమించారు. పట్టణంలో 30 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌లో వెయ్యి లోపు ఓటర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రిజర్వేషన్ల కోసం ఎదురు చూపు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయాల్సిఉంది. ప్రధాన పార్టీలు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. వైఎస్సార్‌పీపీ, తెలుగుదేశం పార్టీ మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పుట్టపర్తిలో 20 నుంచి 28కి
పెరిగిన వార్డుల సంఖ్య
30 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు
రిజర్వేషన్లపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ
రేపు విడుదల కానున్న ఓటర్ల జాబితా
26,890 మంది ఓటర్లు
పట్టణంలో మెత్తం 26,890 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 13,445 పురుష ఓటర్లు, 13,440 మంది మహిళా ఓటర్లు, ఐదురుగు ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే అధికారులు బూత్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఓటర్ల విభజన, ఎన్నికల సామగ్రి కూర్పు తదితర అంశాలపై అధికారులు నిమగ్నమయ్యారు.


