ప్రశాంతి నిలయం: ప్రశాంతి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. కచ్చితంగా ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.
పంటల సాగుకు
పీఎండీఎస్ విధానం మేలు
మడకశిరరూరల్: ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో పెల్లైటెజ్డ్ పీఎండీఎస్ విధానం పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని ఏపీసీఎన్‌ఎఫ్ ఆర్‌వైఎస్‌ఎస్ ఈవీసీ రిటైర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు చేస్తున్న తీరును ఆయన ఆదివారం ఆమిదాలగొందిలో పరిశీలించారు. 44 ఎకరాల్లో చేపట్టిన రెయిన్ ఫెడ్ పెల్లైటెజ్డ్ పీఎండీఎస్ కాంపాక్ట్ బ్లాక్‌ను, ఏ గ్రేడ్ మోడల్, బుళ్లసముద్రంలో దానిమ్మ, ఏ– గ్రేడ్ మోడల్, బూదిపల్లిలో 54 ఎకరాల్లో సాగు చేసిన పీఎండీఎస్ పద్ధతులతో సాగు చేసిన పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు, రైతుకు కలిగే లాభాలు, తగ్గుతున్న పెట్టుబడి, పీఎండీఎస్ విత్తనాలు విత్తే విధానానం, ఏ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ అమలు, విత్తన గుళీకరణ, జీవ వైవిధ్య పంటల ప్రాధాన్యతతో పాటు తక్కువ వర్షపాత నమోదు పరిస్థితుల్లో పంట వ్యవస్థలను స్థిరంగా కొనసాగే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఅండ్‌ఐఓ) లక్ష్మానాయక్, ఎస్‌పీఎ డాక్టర్ నవీన్, మాస్టర్ ట్రైనర్ రమేష్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
సత్యసాయి సేవా స్ఫూర్తిని ప్రపంచానికి చాటడమే లక్ష్యం
ప్రశాంతి నిలయం: సత్యసాయి సేవా స్ఫూర్తిని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా మానవ సేవ అనే ఇతివృత్తంతో లఘుచిత్రోత్సవం నిర్వహించామని సత్యసాయి సేవా సంస్థల ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్య పేర్కొన్నారు. ఆదివారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి లఘు చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని లఘు చిత్రోత్సవానికి మూడు విభాగాల్లో 184 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 33 లఘు చిత్రాల్లో 27ను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో 10 చిత్రాలను ఎంపిక చేశారు. న్యాయ నిర్ణేతలుగా అమరన్ చిత్రానికి జాతీయ అవార్డు పొందిన దర్శకుడు పెరియసామి, నేషనల్ అవార్డు గ్రహీత, నిర్మాత శశికల్ నాయర్, ఫిల్మ్‌ఫేర్ అవార్డు గ్రహీత, రచయిత అమిత్ రాయ్, నాటక రంగ నటుడు నాసిర్ అబ్దుల్లా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్తమ చిత్రాలు అవార్డులకు ఎంపికై నా వారికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి తదితరులు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత భరత్ బాల, జెట్ సింథసిస్ సీఈఓ రాజన్ నవానీ తదితరులు పాల్గొన్నారు.


