అనంతపురం న్యూ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతపురం
జిల్లా పరిషత్ ఇకపై రెండుగా మారనుంది. ప్రస్తుత 13 జెడ్పీల స్థానంలో 28 జిల్లాలకు అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్తుల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ చేశారు. ఈ నెల 25 నుంచి శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ అమలులోకి రానుంది. కొత్త జిల్లా పరిషత్ పరిపాలన సౌలభ్యం కోసం సిబ్బంది కేటాయింపులపై రెండు నెలలుగా కసరత్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు కొత్త జెడ్పీ కేంద్రాల ప్రారంభ ప్రక్రియ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో గత రాత్రి తాత్కాలిక సిబ్బంది కేటాయింపులపై ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్తులకు పంచాయతీరాజ్ కమిషనరేట్ విధివిధానాలను వెల్లడిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ప్రస్తుతమున్న జెడ్పీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని మాత్రమే విభజన చేయాలని పంచాయతీ రాజ్ కమిషనరేట్ స్పష్టం చేసింది. దీనివల్ల కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాల కార్యకలాపాలు సజావుగా నడిచే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సోమవారం సీఈఓ విజయలక్ష్మి పుట్టపర్తిని సందర్శించారు. అక్కడ నూతన జిల్లా పరిషత్ కార్యాలయం కోసం భవనాలను పరిశీలించారు. జెడ్పీ కేంద్ర కార్యాలయాన్ని పుట్టపర్తిలో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది విభజన అనే అంశం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం పూర్తిస్థాయి జిల్లా పరిషత్తుల విభజన జరగనుంది. ప్రస్తుతమున్న అనంతపురం జిల్లా పరిషత్ నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న శ్రీసత్యసాయి జిల్లా పరిషత్‌కు సిబ్బంది కేటాయింపులు ఇలా ఉన్నాయి.


