సాక్షి ప్రతినిధి, అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. మట్టి, ఇసుక, లిక్కర్‌లో అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘పింఛన్’ వచ్చి చేరింది. తాము సిఫార్సులు చేసిన వారికే పింఛన్ మంజూరు చేయాలని నియోజకవర్గ నేత అధికారులకు హుకుం జారీ చేశారు. అర్హతలున్నా, అన్ని డాక్యుమెంట్లతో కార్యాలయానికి వచ్చినా ‘పచ్చ’ నేత సిఫార్సు లేకుంటే దరఖాస్తు పక్కన పడేయండని ఆదేశాలు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. టీడీపీ నేత అనుమతి తీసుకోకుండా డైరెక్టుగా దరఖాస్తు చేసుకుంటే వాటిని అప్‌లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. అర్హులకు న్యాయం చేయాల్సిన అధికారులు కూడా ‘వెన్నుపోటు పార్టీ’నేతల ఆదేశాలనే పాటిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
టీడీపీ నేతలు ఓకే అంటేనే
కొత్త పింఛన్ల కోసం ఈ నెల 7 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రెండేళ్ల తర్వాత దరఖాస్తులు స్వీకరించడంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి భారీగా సచివాలయాలకు క్యూ కట్టారు. ఇదే అదనుగా కళ్యాణదుర్గం ప్రజాప్రతినిధి బరితెగించారు. ప్రజాప్రతినిధి మేనల్లుడు కళ్యాణదుర్గంలో ప్రజావేదిక వద్ద నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటలకే సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్థానిక టీడీపీ నేతలు ఓకే అంటేనే పింఛన్లు నమోదు చేయండి. లేదంటే వాటిని పక్కన పెట్టేయండి. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు అన్ని అర్హతలున్నా స్థానిక టీడీపీ నేతలను కలిసి వచ్చిన తర్వాతే దరఖాస్తులను స్వీకరించండి. అధికార పార్టీ నేతలను కలవకుండా నేరుగా దరఖాస్తు చేసుకుంటే నిర్మొహమాటంగా వాటిని పక్కన పెట్టేయండి. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం’ అని హుకుం జారీ చేశారు.
పంచాయతీ నుంచి ఇద్దరి ఎంపిక
పంచాయతీ పరిధిలో ఇద్దరు చొప్పున టీడీపీ నేతలను నియోజకవర్గ నేత ఎంపిక చేశారు. వీరందరితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ‘మీరు సిఫార్సులు చేసిన వారి జాబితా మండల నేతకు ఇవ్వండి. మీరంతా ఓకే అంటేనే పింఛన్ మంజూరవుతుంది. ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు అన్ని అర్హతలూ ఉండి దరఖాస్తు చేసుకుంటే వారంతా మీ దగ్గరికి వచ్చి బతిమాలితేనే ఓకే చెప్పండ’ని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతీ పంచాయతీలోనూ వెన్నుపార్టీ నేతలు పింఛన్ల మంజూరు పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. ‘పచ్చ’ పార్టీ నేతల ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని వాపోతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు తమకు కావాల్సిన వారికి అర్హత లేకపోయినా దరఖాస్తు చేయించినట్లు సొంత పార్టీ కార్యకర్తలే చెప్తుండడం గమనార్హం.
2,657
కళ్యాణదుర్గం
1,389
శెట్టూరు
1,355
బ్రహ్మసముద్రం
ఈ చిన్నారి పేరు మోక్షిత. వయసు ఆరేళ్లు. బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామం. కుడిచేయి పూర్తిగా సహకరించదు. వైకల్యం 40 శాతం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం పోర్టల్ ప్రారంభించగానే అన్ని పత్రాలతో ఈ నెల 12న దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి దరఖాస్తును టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు ఆదేశాల మేరకు స్థానిక డిజిటల్ అసిస్టెంట్ అప్‌లోడే చేయలేదు. దీంతో చిన్నారిని తీసుకుని సోమవారం కలెక్టరేట్‌లో తమ సమస్యను విన్నవించుకున్నారు.
1,844
కుందుర్పి
2,049
కంబదూరు
మేం చెప్పిన వారికే ఓకే చేయాలి తెలుసు కదా..?
కళ్యాణదుర్గంలో బరితెగించిన అధికార పార్టీ నేతలు
ఎంపీడీఓలు, డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లతో భేటీ
టీడీపీ నేతల సిఫార్సులనే అప్రూవ్ చేయాలని హుకుం
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల దరఖాస్తుల తిరస్కరణ


