అర్జీలకు తక్షణం పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు తక్షణం పరిష్కారం చూపాలి

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

ఎస్పీ సతీష్‌కుమార్‌

పుట్టపర్తి టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ సూచించారు. పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌ కుమార్‌ సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో సీఐ బొజ్జప్ప, ఎస్‌బీ ఎస్‌ఐ బాలరాజు, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రావులచెరువులో

దొంగల బీభత్సం

ఒకే రాత్రి 8 చోట్ల కేబుల్‌ చోరీ

ధర్మవరం రూరల్‌: మండల పరిధిలోని రావులచెరువు గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి 8 చోట్ల వ్యవసాయ మోటర్‌ కేబుల్‌ వైర్లను అపహరించారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో బోరు బావుల ద్వారా వస్తున్న అరకొర నీటితో పంటలను పండించుకుంటున్న రైతులు ఈ ఘటనతో బెంబేలెత్తుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతులు రామలింగారెడ్డి, కులశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, రఘునాథరెడ్డి, సతీష్‌రెడ్డి, ఓబుళరెడ్డి, డి. ఓబుళరెడ్డిలు తెలిపారు.

సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయంలో

పాము కలకలం

పుట్టపర్తి: బుక్కపట్నం మండల కేంద్రంలో ఉన్న సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలోకి సోమవారం 8 అడుగుల పాము చొరబడడం కలకలం రేపింది. తరచూ విష పురుగులు కనిపిస్తుండడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నారు.

పునఃప్రతిష్ఠించి..

గంగ ఒడికి చేర్చి!

సోమందేపల్లిలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం

సోమందేపల్లి (పరిగి): సోమందేపల్లిలోని దుర్గానగర్‌లో రెండు రోజుల క్రితం వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిమజ్జనానికి తరలిస్తున్న గణనాథుడి ప్రతిమ ప్రధాన రహదారి మధ్యలో పడిపోయింది. దీన్ని అపచారంగా భావించిన కాలనీ వాసులు, కమిటీ సభ్యులు తిరిగి సోమవారం వినాయక విగ్రహంతో పాటు గంగమ్మ ప్రతిమను పునఃప్రతిష్ఠ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు.

23న జాబ్‌ మేళా

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 23న జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. అనంతపురం, పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతతో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పలు ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొని అర్హతలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. విద్యార్హత, వయసు, ఉద్యోగ స్వభావం, సంస్థను బట్టి వేతనాలు, ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు ఉంటాయని ప్రిన్సిపల్‌ పద్మశ్రీ, జేకేసీ కోఆర్డినేటర్‌ జీవన్‌కుమార్‌ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హతల ధ్రువపత్రాలు, అవసరమైన ఇతర పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement