తాడిపత్రి రూరల్: స్థానిక పులిప్రొద్డుటూరు రహదారిపై వ్యాన్ టైరు మారుస్తుండగా.. పాల వ్యాన్ రూపంలో మృత్యువు దూసుకొచ్చి డ్రైవర్ ఎజ్జాన్‌బాష (46) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అప్‌గ్రేడ్‌సీఐ నారాయణరెడ్డి వివరాల మేరకు.. వైఎస్సార్ కడపజిల్లా ఖాజీపేట మండలం సర్వర్‌ఖాన్‌పేటకు చెందిన ఎజ్జాన్‌బాష మినీవ్యాన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన షేక్‌ఖాజా పొగాకు సరుకును బళ్లారికి తరలించేందుకు మినీ వ్యాన్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు. దీంతో శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి బయల్దేరారు. తెల్లవారుజామున పులిపొద్దుటూరు వద్ద రాగానే మినీవ్యాన్ టైరు పగిలిపోయింది. దీంతో వాహనాన్ని రోడ్డువైపు ఆపి ఇండికేటర్లు వేసి ఎజ్జాన్‌బాషా టైరు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో గుత్తివైపు నుంచి వచ్చిన శ్రీనిధి పాలడెయిరీ గూడ్స్ వాహనం వేగంగా వచ్చి మినీ వ్యాన్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఎజ్జాన్‌బాషాపై గూడ్స్ వాహనం వెనుక చక్రాలు ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో పక్కనే ఉన్న పొగాకు రైతు షేక్‌ఖాజాకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎజ్జాన్‌బాష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు హబీబుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
గూడ్స్ వాహనం ఢీకొని వ్యాన్ డ్రైవర్ దుర్మరణం


