రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం బళ్లారిరోడ్డు రాచానపల్లి సమీపంలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నార్పల మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన కొవ్వూరి అమృతకుమార్‌రెడ్డి, ధర్మవరానికి చెందిన మనోహర్‌రెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కళాశాల నుంచి బయటకు వెళ్లారు. ఓ మద్యం దుకాణం సమీపంలో కనిపించగా, కళాశాల యాజమాన్యం వారిని చూసింది. దీంతో అక్కడి నుంచి పరారైన విద్యార్థులు రాత్రి 9 గంటలకు హాస్టల్‌కు చేరుకున్నారు. ఈ విషయంపై యాజమాన్యం వారిని మందలించడంతో పాటు, వారి ఎదుటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆదివారం కళాశాలకు రావాలని సమాచారం ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు తెల్లవారుజామున మళ్లీ హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. అమృతకుమార్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని, తోటి విద్యార్థులను విచారించారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96811 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


