గణేశ్‌ నిమజ్జనానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనానికి వేళాయె

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

హిందూపురం టౌన్‌: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా హిందూపురం పట్టణంలో గణేశ్‌ నిమజ్జనాన్ని నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆఖరి ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

కోనేరు సిద్ధం..

గణపయ్యల నిమజ్జనానికి గుడ్డం కోనేరులో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 26 అడుగుల లోతుతో కోనేరును సిద్ధం చేశారు. భారీ విగ్రహాలను వాహనాలపై నుంచి కిందకు దించడానికి మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో రెండు క్రేన్‌లను ఉంచారు. గణపతి విగ్రహాలను క్రేన్‌ ద్వారా నేరుగా కోనేరులో నిమజ్జనం చేయడానికి అనుకులంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం నిమజ్జనం చేయడానికి కోనేరు వద్ద మూడు స్పాట్స్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కోనేరులో పూర్తిస్థాయిలో నీరు నింపారు. అలాగే చుట్టూ బారికేడ్లు కట్టారు. ఎంజీఎం స్కూల్‌ వైపు నుంచి కోనేరు పక్కకు రావడానికి దారి పక్కన కూడా బారికేడ్లు నిర్మించారు. కోనేరు చుట్టూ విద్యుత్‌ లైట్లను అమర్చారు. ప్రజలు నిమజ్జనాన్ని వీక్షించడానికి ఏర్పాట్లను చేశారు. కోనేరు వద్ద గంగా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున తెలిపారు. ఇది ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం..

పట్టణంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఆదివారం భారీ వినాయక విగ్రహాల ఊరేగింపు తరలివెళ్లే చోట్ల ఏరియాల వారీగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారు. తర్వాత మైన్‌ రోడ్డులో కూడా కొంత ఇబ్బంది ఉండవచ్చని, అయితే విగ్రహాలు తరలిన వెంటనే ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తామని ట్రాన్స్‌కో ఈఈ చంద్రానాయక్‌ తెలిపారు.

భారీ వాహనాలకు అనుమతి లేదు..

నిమజ్జనం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచే పట్టణంలోకి ఎలాంటి పెద్ద వాహనాలను అనుమతించడం లేదు. అనంతపురం, కొడికొండ చెక్‌పోస్టు వైపు నుంచి వచ్చే ప్రై వేటు, ఆర్టీసీ బస్సులను చోళసముద్రం హైవే వద్ద నుంచి కొట్నూరు బైపాస్‌ రోడ్డులోకి ప్రవేశించి, ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలన్నారు. తిరిగి అలాగే వెళ్లాలి. అలాగే బెంగళూరు నుంచి వచ్చే బస్సులు కూడా గౌరిబిదనూరు ఓల్డ్‌ ఆర్టీఓ దగ్గర డైవర్షన్‌ తీసుకుని వాటంకొత్తపల్లి మార్గంలో నగరిగెర, లేపాక్షి, చోళసముద్రం, కొట్నూరు బైపాస్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలి. దీంతో పాటు మధుగిరి, మడకశిర నుంచి వచ్చే వాహనాలను సేవామందిరం వరకు అనుమతి ఇచ్చారు.

‘పురం’లో నేడు గంగ ఒడికి చేరనున్న వినాయకుడు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పోలీసు బందోబస్తు ఇలా..

ఏఎస్పీ – 1

డీఎస్పీలు – 8 మంది

సీఐలు – 33 మంది

ఎస్‌ఐలు – 47 మంది

పోలీసు సిబ్బంది – 900 మంది

మున్సిపాలిటీ పర్యవేక్షణ ఇలా..

ఇంజనీరింగ్‌ సిబ్బంది,(స్ట్రీట్‌ లైటింగ్‌, కోనేరు వద్ద) – 50 మంది

శానిటేషన్‌ సిబ్బంది(ప్రధాన రహదారుల్లో) – 250 మంది

కోనేరును ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి (తెప్పల ద్వారా) – నలుగురు

శానిటేషన్‌ వర్కర్స్‌ – 8 మంది

శానీటరీ ఇన్‌స్పెక్టర్‌ – 1

విద్యుత్‌ పర్యవేక్షణ ఇలా..

ఏడీలు –ముగ్గురు

ఏఈలు – 12 మంది

జేఈఈలు – 10మంది

లైన్‌ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, మొబైల్‌ టీమ్‌, ఇతర సిబ్బంది – 120 మంది

ట్రాన్స్‌కో కంట్రోల్‌ రూం – 9440813209

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement