గిన్నిస్ రికార్డు సాధించాలి
పుట్టపర్తి అర్బన్: నిర్ణీత సమయంలో జాతీయ రహదారి–544జీ పనులను పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. బెంగళూరు–విజయవాడ జాతీయ రహదారి–544జీ పనులను మంగళవారం ఎస్పీ సతీష్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. పనులు చేపడుతున్న రాజ్‌ఫత్ ఇన్‌ఫ్రాక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎండీ జగదీష్ కదర్ పురోగతిని వారికి వివరించారు. 52 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారిని వారం రోజుల్లో పూర్తి చేసేలా శరవేగంగా పనులు చేపడుతున్నామన్నారు. 11.5 మీటర్ల వెడల్పుతో రహదారి ఏర్పాటవుతోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి ఉన్నారు.
ఖనిజాల గుర్తింపునకు హెలికాప్టర్ సర్వే
కదిరి అర్బన్/ ముదిగుబ్బ: కదిరి పరిసర ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు జీఎల్‌ఎఫ్‌సీ అనే సంస్థ మంగళవారం హెలికాప్టర్ ద్వారా సర్వే చేపట్టింది. ఈ క్రమంలో కదిరి మండలం వై. కొత్తపల్లి వద్ద ఎకరం భూమిలో హెలీప్యాడ్‌తో పాటు సర్వే సామగ్రిని భద్రపరచుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ మురళీకృష్ణ తెలిపారు. రెండు నెలలపాటు కదిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారన్నారు. కాగా, హెలికాప్టర్‌ను చూసేందుకు సమీప గ్రామ ప్రజలు తరలిరావడంతో సందడి నెలకొంది.
సెంట్రల్ వర్సిటీ
స్నాతకోత్సవానికి రాష్ట్రపతి!
అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో జరిగే స్నాతకోత్సవానికి విజిటర్ హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2018లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైంది. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి స్నాతకోత్సవం నిర్వహించలేదు. దీంతో 2018–20 పీజీ, 2018–21 డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. మొత్తం 845 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు.
గిన్నిస్ రికార్డు సాధించాలి
గిన్నిస్ రికార్డు సాధించాలి


