ఎవరూ తప్పించుకోలేరు
సాక్షి, పుట్టపర్తి
క్యాలెండర్ మారినా.. పోలీసు అధికారులు మారినా.. జిల్లాలో హత్యలు...హత్యాయత్నాలు మాత్రం ఆగడం లేదు. కొత్త ఏడాది ఆరంభం రోజు నుంచి ఇప్పటికే రెండు హత్యలు, రెండు హత్యాయత్నాలు వెలుగు చూశాయి. శాంతిభద్రతల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు రాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాల చిచ్చు, క్షణికావేశంలో మాటామాటా పెరిగి చెలరేగుతున్న వివాదాలు హత్యలకూ దారి తీస్తున్నాయి. హత్యలు, హత్యాయత్నాల్లో 90 శాతం ఘటనలు రాత్రి వేళల్లోనే జరగడం గమనార్హం.
మద్యం మత్తులోనే...
హత్యలు, హత్యాయత్నం కేసుల్లోని నిందితులంతా మద్యం మత్తులోనే ఘటనలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. మద్యం మత్తులో వాటి గురించి చర్చించడం.. అనంతరం ఆ మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రాణాలు తీయడం..లేదా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మందుబాబులకు అలవాటుగా మారింది.
యువకులే అధికంగా..
హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితులంతా 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారే ఉంటున్నారు. నలుగురు గుంపుగా చేరడం.. ప్లాన్ చేయడం..అంతమొందించడం...లేదా హత్యాయత్నం చేస్తూ సమాజంలో అశాంతికి కారణమవుతున్నారు. నిందితులకు వసతి కల్పించిన వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న దాఖలాలున్నాయి. హత్య చేసిన తర్వాత క్షణికావేశంలో చేశామని.. చెబుతున్నా.. చట్టం ముందు శిక్షార్హులే కావడంతో చాలామంది యుక్త వయసులోనే కటకటాల పాలవుతున్నారు. ఏదైనా తగాదా ఉంటే.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తే ఫలితం ఉంటుందని అవగాహన కల్పిస్తున్నా.. మార్పు రావడం లేదు.
పోలీసుల నిర్లక్ష్యమూ కారణమే..
ఫలానా వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని బాధితులు సమాచారం ఇచ్చినా.. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటంతోనే హత్యలకు దారి తీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా జరిగిన హత్యలు కూడా జిల్లాలో వెలుగు చూశాయి. కొత్తచెరువు యువకుడి హత్య ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఏదైనా తగాదా ఉన్నా.. గొడవ జరిగినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి. డయల్ 100కు కాల్ చేసినా పోలీసులు అందుబాటులోకి వస్తారు. హత్యలు, హత్యాయత్నాలు సరికాదు. కేసులు మోసుకున్నా.. నేరాలకు పాల్పడినా.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ
ఎవరూ తప్పించుకోలేరు


