జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి పనిచేద్దాం
పుట్టపర్తి అర్బన్: జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేద్దామని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, హిందూపురం ఎంపీ పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించారు. చైర్మన్ పార్థసారథి మాట్లాడుతూ... గత సమావేశాల్లో చర్చించిన అంశాలు, సమస్యలపై తీసుకున్న నిర్ణయాలపై తప్పనిసరిగా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఎక్కడైనా లోపాలుంటే సరిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో పూర్తి చేసిన పనులకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. అనర్హుల పెన్షన్‌లను తొలగించి అర్హులకు మంజూరు చేయాలన్నారు. సోలార్‌ను ఎక్కుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘దిశ’ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఓ సారి తప్పకుండా ‘దిశ’ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ.. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారికి అతి తక్కువ ధరతో అందజేసే టెర్బుటాలిన్ ఇంజక్షన్‌ను తప్పనిసరిగా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే 2024–25 ‘పల్లె పండుగ’లో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేషులు మాట్లాడుతూ... రైతు పరపతి సంఘాల ద్వారా కట్టిన గోడౌన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రహదారి సౌకర్యం లేని గోడౌన్‌లకు ‘ఉపాధి’ ద్వారా రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
‘దిశ’ సమావేశంలో చైర్మన్ పార్థసారధి,
కలెక్టర్ శ్యాంప్రసాద్


