రైతుల కోసం కేతిరెడ్డి జలపోరాటం
ధర్మవరం: జలం కోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోరుబాట పట్టారు.
పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా నియోజకవర్గంలోని 24 చెరువులను నింపకుండా చోద్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై సమరశంఖం పూరించారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా నీరు విడుదల చేసి నియోజకవర్గంలో 24 చెరువులు నింపాలన్న డిమాండ్‌తో బుధవారం రైతులతో కలిసి తాడిమర్రి మండలం మేడిమాకులపల్లి నుంచి ‘జల పోరాటం’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడిమాకులపల్లి పీఏబీఆర్ కుడి కాలువ వద్ద నుంచి రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి బైక్‌లపై ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ అనంతపురం రూరల్ మండలం మన్నీల వరకూ సాగింది. మార్గమధ్యలో పీఏబీఆర్ కుడి కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండిపోవడాన్ని చూసి కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
చెరువులను నింపే వరకు పోరాడతాం
పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా నియోజకవర్గంలోని 24 చెరువులు నింపే వరకూ రైతుల తరఫున పోరాడతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురం రూరల్ మండలం మన్నీల పీఏబీఆర్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసి చెరువులను పూర్తి స్థాయిలో నింపిన విషయాన్ని గుర్తు చేశారు. ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి కాలువలు ఎక్కడ ఉన్నాయో.. ఏ గ్రామాల్లో చెరువులు నిండుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సర్కార్ నిర్లక్ష్యం వల్ల భూగర్భ జలమట్టం తగ్గి బోర్లు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 చెరువులును నింపాలని కోరారు. అంతవరకూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులతో నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ తాడిమర్రి సుధాకర్‌రెడ్డిలతోపాటు ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పీఏబీఆర్ కుడి కాలువకు నీరిచ్చి చెరువులు నింపాలని డిమాండ్
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని
నిరసిస్తూ కాలువ వద్ద బైక్‌లతో ర్యాలీ
భారీగా హాజరైన రైతులు,
వైఎస్సార్‌సీపీ శ్రేణులు
నీరివ్వకపోతే రైతులతో కలిసి
ఉద్యమిస్తామని కేతిరెడ్డి హెచ్చరిక


