పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయాలి
పుట్టపర్తి అర్బన్: జిల్లాల ఏర్పాటవుతున్న పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. భూ సర్వేలు, సాంకేతిక అంశాలు, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు .
‘మెప్మా’లో అవినీతిపై
విచారణ ప్రారంభం
హిందూపురం: మున్సిపాలిటీలోని ‘మెప్మా’ విభాగంలో చోటుచేసుకున్న అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. వివిధ పథకాల పేరిట డబ్బులు వసూలు చేశారని, రుణాలు మంజూరు చేయాలంటే మెప్మా అధికారికి ముడుపులు ఇవాల్సి వస్తోందని ఆరోపిస్తూ కొందరు ఆర్‌పీలు ప్రాజెక్టు డైరెక్టర్‌కు సమైఖ్య ద్వారా ఫిర్యాదు లేఖను పంపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మెప్మా పీడీ నాగరాజు సమగ్ర విచారణకు ఆదేశించారు. మెప్మా అధికారులు వాసుదేవరెడ్డి, రమాదేవిలను విచారణ అధికారులుగా నియమించారు. దీంతో బుధవారం వారు హిందూపురం మున్సిపాల్టీలోని మెప్మా విభాగంలో పట్టణ రీసోర్స్ పర్సన్లతోపాటు మెప్మా సీఓలు, తెలుగుతల్లి పట్టణ సమాఖ్య, భరతమాత పట్టణ సమాఖ్య సభ్యులతో విడివిడిగా విచారించారు. విశ్వకర్మ రుణాల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలపై విచారించారు. విశ్వజ్యోతి సంఘంలో రూ.17 లక్షలు అవినీతి జరిగినట్లు టీఎల్‌ఎఫ్ ప్రతినిధులు అధికారులకు పంపిన ఫిర్యాదులో పేర్కొనగా...వాటిపై వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, మెప్మా విభాగంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేశామని, నివేదికను పీడీకి అందజేస్తామన్నారు.
అసాంఘిక శక్తులను అణచివేయాలి
● పోలీసులకు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
ముదిగుబ్బ: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాకప్ గది, రిసెప్షన్ కౌంటర్ పరిసరాలను పరిశీలించారు. మహిళల నుంచి అందే ఫిర్యాదులపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, కోడి పందేలు తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పనిచేయాలన్నారు.
పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయాలి
పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయాలి


