వీధికుక్క దాడి.. ఆరుగురికి గాయాలు
అగళి: మండలంలోని మధూడి గ్రామంలో బుధవారం ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. తొలుత ఓ చిన్నారిని, రక్షించేందుకు వచ్చిన మరో ఐదుగురిపై దాడి చేసింది. వివరాల్లోకి వెళితే...బుధధవారం ఉదయం మధూడి గ్రామంలోని ఎస్సీ కాలనిలో ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన నింగమ్మ, వీరభద్రప్ప, హనుమంతరాజు, తిమ్మక్క, నరసమ్మ,హేమంత్ తదితరులపైనా తీవ్రంగా దాడి చేసింది. దీంతో స్థానిక యువకులు కుక్కను కొట్టి చంపేశారు.
పీహెచ్‌సీ వద్ద ఆందోళన..
కుక్కకాటు బాధితులంతా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే అక్కడ కుక్క కాటుకు మందు లేదు. వైద్య సిబ్బంది కేవలం రక్త గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. దీంతో కుక్కకాటు బాధితుల్లో కొందరిని రొళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొందరిని కర్ణాటక రాష్ట్రం శిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం బాధితుల బంధువులు అగళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని డాక్టర్ శివానందపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కుక్కకాటుకు మందులు కూడా తెప్పించ లేరా... అంటూ మండిపడ్డారు. మందులు లేని ఆస్పత్రి ఎందుకంటూ ఆస్పత్రికి తాళం వేసి ఆవరణలో ఆందోళన చేశారు. వైద్యుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అగళి పీహెచ్‌సీలో అందుబాటులో లేని కుక్కకాటు మందు
వైద్య సిబ్బందిపై బాధితుల ఆగ్రహం
వీధికుక్క దాడి.. ఆరుగురికి గాయాలు


