‘అనంత పాలధార’ను విజయవంతం చేయండి
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక రూరల్ మండలం ఆకుతోటలపల్లి గ్రామంలో ఈ నెల 7 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘అనంత పాలధార’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పశుసంర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాయలసీమలోనే తొలిసారిగా ‘అనంత’లో వినూత్నమైన కార్యక్రమం తలపెట్టామన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొలిరోజు బుధవారం మూడు విభాగాల పాల దిగుబడి పోటీలు ఉంటాయన్నారు. మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. రెండో రోజు గురువారం లేగదూడల ప్రదర్శన, వాటి అందాల పోటీలు, అలాగే గర్భకోశవ్యాధి శిబిరం ఉంటుందన్నారు. మూడో రోజు ముగింపు, బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి మేలు జాతి పాడి ఆవులతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది కేవలం పోటీ కాదని, పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపే విప్లవాత్మక ఉద్యమమని తెలిపారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పాడి పెంపకం, మెరుగైన పశుజాతులు, సమతుల్య పోషణ, పాల దిగుబడి పెంపు, కృత్రిమ గర్భధారణ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురైన ఓ వృద్ధురాలు అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటుకలపల్లి పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన కోటా రాములమ్మ (74) కుమార్తె అనితకు కందుకూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న అనితను చూసేందుకు ఈ నెల 2న రాములమ్మ వచ్చింది. 5వ తేదీ భర్తతో కలిసి అనిత అనంతపురంలో చికిత్స కోసం వెళ్లిన సమయంలో గీజరు సాయంతో నీళ్లు వేడి చేసుకునే క్రమంలో రాములమ్మ విద్యుత్ షాక్‌కు గురై బాత్రూంలో పడిపోయింది. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుమార్తె, అల్లుడు విషయాన్ని గుర్తించి వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ఆమె మృతి చెందింది. ఘటనపై రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.


