జీవితమే నర్తనమాయే
ధ
ర్మవరంలోని బ్రాహ్మణవీధిలో నివాసముంటున్నాం. మా అమ్మ, నాన్న లలితమ్మ, దుత్తలూరి రామారావుకు నాట్యం అంటే ఎంతో మక్కువ. నాన్న సినీ పరిశ్రమలోనూ రాణించారు. వారి స్ఫూర్తితోనే నా చిన్నప్పటి నుంచే మా అమ్మ దగ్గర నాట్యం అభ్యసిస్తూ వచ్చాను. 1985 నుంచి ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నా. నా భార్య కమలాబాలాజీ కూడా నాట్యాచార్యులే. ఇద్దరమూ కలసి ధర్మవంలోనే శ్రీలలిత నాట్య కళానికేతన్ పేరుతో శాసీ్త్రయ నృత్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ వేలాది మంది మా వద్ద శిక్షణ పొందారు. నేడు వారంతా నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. నావరకు సొంతంగా రచించుకున్న జానపద గేయాలు ఆలపిస్తూ నాట్యం చేస్తుంటా. దూరదర్శన్ చానల్‌లో భరతనాట్యం, కూచిపూడి, జానపద నాట్యంపై 40కి పైగా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం దక్కింది. తల్లిదండ్రుల నుంచి అలవడిన ఈ కళ మా జీవితమైంది. నా భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలూ భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాల్లో సిద్దహస్తులు. లెక్కకు మంచి అవార్డులు సొంతమయ్యాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలువురి ప్రశంసలు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ధర్మవరంలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఎవరికి ఆసక్తి ఉన్నా.. అక్కడికెళ్లి వారికి నాట్యంలో శిక్షణ ఇస్తున్నా.


