● కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
● పెండింగ్ బకాయిల కోసం ధర్నా
నెల్లూరురూరల్: ‘అయ్యా మండల కార్యాలయాల్లో వినతులిస్తున్నాం. పట్టించుకోవడం లేదు. మీరైనా మా అర్జీలను పరిశీలించి పరిష్కరించండి’ అని ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధనరెడ్డి, మెప్మా, డీఆర్డీఏ పీడీలు కిరణ్‌కుమార్, నాగరాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
పెండింగ్ బకాయిల కోసం..
అంగన్‌వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పాఠశాల ఆయాలు, వాచ్‌మెన్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు రెహనా బేగం కోరారు. కలెక్టరేట్ ఎదుట 24 గంటల నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెగా పేరెంట్స్ డే ఖర్చులను కూడా చెల్లించాలని, ఒక్కో విద్యార్థికి మెనూ బిల్లును రూ.20కు పెంచాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.


