● వారికిచ్చే సొమ్ములో చేతివాటం
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: నేతన్న భరోసా కింద చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేసిన నగదును సైతం పచ్చ నేతలు వదలకుండా చేతివాటాన్ని ప్రదర్శించి ఒక్కొక్కరి వద్ద రూ.రెండు వేల చొప్పున వసూలు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని నేదురుమల్లిలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణిని గ్రామస్తులు కలిసి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడిందని వాపోయారు. అనంతరం ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలంటే సోమిరెడ్డి పత్తాలేకుండా పోయారని విమర్శించారు. గ్రామాల్లో మౌలిక వసతుల్లేవని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇసుక, మట్టి, గ్రావెల్ దందాను సోమిరెడ్డి సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ, దేవదాయ, అటవీ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు.
పంటకు గిట్టుబాటు ధరలెక్కడ..?
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కల్పించడంలేదని దుయ్యబట్టారు. పుట్టి రూ.16 వేలకు రైతులు విక్రయించాల్సి వస్తోందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మూడు నెలల తర్వాత రూ.36 వేల మేర దళారులు, మిల్లర్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించకుండా.. దళారులు, మిల్లర్లకు ఉపయోగపడేలా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధికి రూ.మూడు వేల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామాల్లో సమస్యలపై తమ పార్టీ మాజీ సర్పంచ్‌లు స్పందించి నిధులను వెచ్చించి పనులు చేయడాన్ని అభినందించారు. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ నిధులను దోపిడీ చేసేందుకు అధికార పార్టీ నేతలు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన పార్టీ నేత చేపూరు చంద్రమౌళి కుమార్తె భార్గవి ముందస్తు వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, ఉడతా రమేష్, పెంచలనాయుడు, కరిపరెడ్డి కృష్ణారెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్, తిరుపాల్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజద్, కేతు రామిరెడ్డి, వెంకటరమణయ్య, విజయభాస్కర్‌రెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


