ఉద్యోగాల పేరుతో వల.. చిక్కితే విలవిల | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో వల.. చిక్కితే విలవిల

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

ఇటీవల జరిగినవి

మోసపోతున్న నిరుద్యోగులు

పెరుగుతున్న ఫిర్యాదులు

అప్రమత్తంగా ఉండాలంటున్న

పోలీసులు

నెల్లూరు(క్రైమ్‌): ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న నిరుద్యోగులు, ఉన్నత విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగాలు, భారీ వేతన ప్యాకేజీలు ఇప్పిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువులు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ మోసగాళ్లు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల నగదు వసూలు చేస్తున్నారు. డబ్బు చేతికందిన తర్వాత కొందరు పరారవుతుండగా, మరికొందరు తమ పలుకుబడితో బాధితులను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఆకర్షణీయ ప్రకటనలతో వల

జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు సంబంధించినవి అధికంగా ఉంటున్నాయి. అలాగే ప్రతి సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న యువత సోషల్‌ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలను నమ్మి మోసపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో రూ.లక్షల వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే నకిలీ కన్సల్టెన్సీలు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి. ఉద్యోగం వస్తుందన్న ఆశతో నిజానిజాలు తెలుసుకోకుండానే పలువురు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

అవగాహన అవసరం

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు నిర్దిష్ట విధానంలో జరుగుతాయి. ఉద్యోగ ప్రకటన జారీ చేసిన అనంతరం రాతపరీక్ష, ఇతర ఎంపిక ప్రక్రియల ద్వారా ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ ఉద్యోగానికీ డబ్బులు తీసుకుని నియామకం చేపట్టరు. ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే పలువురు మోసగాళ్ల బారిన పడుతున్నారు.

ముందుగా నిర్ధారించుకోవాలి

ఉద్యోగార్థులు దళారులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే వెబ్‌సైట్ల విశ్వసనీయతను ముందుగా పరిశీలించాలని చెబుతున్నారు. ప్రకటనలో ఉన్న మొబైల్‌ నంబర్లను మాత్రమే సంప్రదించకుండా.. సంబంధిత సంస్థ ప్రధాన కార్యాలయం లేదా శాఖ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి ఉద్యోగ అవకాశం నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కొలువులు ఇప్పిస్తామని నగదు డిమాండ్‌ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

రూ.6.50 లక్షలు తీసుకుని

ఫేక్‌ లెటర్‌

చిన్నబజారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగాన్వేషణలో ఉండగా నవీన్‌కుమార్‌, అతని స్నేహితుడు పరిచయమయ్యారు. బెంగళూరులోని ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6.50 లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం ఫేక్‌ లెటర్‌ పంపి మోసగించారు. దీంతో బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

రూ.12 లక్షలు తీసుకుని బెదిరింపులు

నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రసాద్‌ అనే వ్యక్తి రూ.12 లక్షలు తీసుకుని మోసగించాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నగదు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాడు.

రూ.15.62 లక్షల వసూలు

పొదలకూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చిత్తూరుకు చెందిన వినయ్‌కుమార్‌ రూ.15.62 లక్షలు తీసుకుని మోసగించాడు. తనకు జరిగిన మోసంపై యువకుడు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement