నెల్లూరు(లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ.నరసింహమూర్తి బుధవారం నెల్లూరులోని జిల్లా కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుపతి జిల్లా ప్రత్యేక (ఎర్రచందనం)కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, బార్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయ్యప్పరెడ్డి, జల్లి పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడి మృత్యువాత
నెల్లూరు సిటీ: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్ చాన్‌బాషా (68) ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం మంగళవారం నరుకూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి చినతోపు వైపు వెళ్తున్న ట్రక్కు సైడు మిర్రర్ తగలడంతో కిందపడి గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..
● ప్రియుడితో కలిసి భర్తను
హతమార్చిన భార్య
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
కోట: మండలంలోని లక్ష్మక్కకండ్రిగకు చెందిన పల్లాల కోటయ్య అనే వ్యక్తి హత్య కేసులో నిందితులు పల్లాల మంజుల, కర్లపూడి చందులను బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు గూడూరు సీఐ మాలకొండయ్య తెలిపారు. వివరాలను కోట పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెల్లడించారు. లక్ష్మక్కకండ్రిగ దళితవాడకు చెందిన పల్లాల కోటయ్య, మంజుల భార్యాభర్తలు. కాగా అదే గ్రామానికి చెందిన కర్లపూడి చందుతో మంజులకు రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో చందుతో కలిసి భర్త కోటయ్యను చంపేందుకు మంజుల పథకం పన్నింది. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి కోటయ్య నిద్రలో ఉండగా మంజుల, చందు కలిసి పైలాన్ తాడు, చీరతో మెడకు ఉచ్చు బిగించి బలంగా లాగి చంపినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కేసును ఛేదించిన ఎస్సై పవన్ కుమార్, సిబ్బంది శోభారాణి, పవన్ చంద్ర, మధుబాబును అభినందించారు.


