చిన్న జీవి.. పెద్ద ముప్పు | - | Sakshi
Sakshi News home page

చిన్న జీవి.. పెద్ద ముప్పు

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

నెల్లూరు(అర్బన్‌): దోమ పరిమాణంలో చాలా చిన్నదే. కానీ మనిషి ఆరోగ్యంపై చూపే ప్రభావం చాలా పెద్దది. దాని కాటు ద్వారా వచ్చే వ్యాధులతో అనేక మంది మృతిచెందుతున్నారు. దోమల ద్వారా వ్యాపించే డెంగీలాంటి పలు వ్యాధులతో రాష్ట్రంలో లక్షలాది మంది, జిల్లాలో వేలాది మంది ప్రతి సంవత్సరం జబ్బుల బారిన పడుతున్నారు. ఇప్పటికీ దేశంలో మలేరియా లాంటి వ్యాధులతో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను చైతన్యం చేసేందుకు పూనుకుంది. మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలిస్‌ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని 1897 ఆగస్టు 20న సర్‌ రోనాల్డ్‌ రాస్‌ అనే శాస్త్రవేత్త నిరూపించారు. ఆ రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నీటి నిల్వలే ఆవాసాలు

ఇళ్లు, పరిసరాల్లో ఏ కొంచెం నీరు నిల్వ ఉన్నా అందులో దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వ్యాప్తి చేస్తాయి. ఆవరణలో పడి ఉండే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, పూల కుండీలు, నీటి ట్యాంక్‌లు, డ్రమ్ములు, గుంతల్లో నిల్వ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంతతిని వ్యాప్తి చేస్తాయి.

వచ్చే జబ్బులివే..

దోమలు కుట్టడం వల్ల ప్రధానంగా డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ లాంటి అనేక వ్యాధులు వస్తాయి. వీటిలో జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వస్తే తీవ్ర ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని రకాల డెంగీ జ్వరాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఫైలేరియా వస్తే బోధకాళ్లతో జీవితాంతం బాధను అనుభవించాల్సి ఉంటుంది. మలేరియాతో సైతం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మగ దోమలు మనుషులను కుట్టవు. అవి మకరందాన్ని పీల్చుకుని బతుకుతాయి. ఆడ దోమలు మనుషుల రక్తాన్ని పీల్చుకుంటాయి. ఇలా రక్తాన్ని పీల్చుకునే సమయంలో దోమ నోటి లాలాజలంలో ఉండే వైరస్‌లు, పరాన్నజీవులు మనిషి శరీరంలోని రక్తంలోకి ప్రవేశించి జబ్బులకు కారణమవుతాయి. ఈ రకమైన వైరస్‌లు, పరాన్నజీవులకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

నిర్లక్ష్యం వద్దు

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఉంటే డెంగీ లాంటి వ్యాధులు అయి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో సొంత వైద్యం మానుకుని దగ్గరలోని వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

ఏం చేయాలంటే..

దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవడం ద్వారా దోమల నియంత్రణ జరిగి వ్యాధులను అదుపులోకి తీసుకురావొచ్చు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా కొంచెం కూడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు గుడ్లు పెట్టకుండా నీటి పాత్రలపై మూతలు ఉంచాలి. కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయించాలి. దోమతెరలు వాడాలి. వారానికి ఒకరోజైనా నీటి తొట్టిలను శుభ్రం చేసి డ్రైడేగా పాటించాలి. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలి.

అన్ని శాఖలతో సమన్వయం

దోమల నియంత్రణకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్యశాఖ పనిచేయాలి. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పని చేయాలి. పారిశుధ్యం మెరుగుపడితే దోమల ఉత్పత్తి కేంద్రాలు తగ్గుతాయి.

ప్రాణాంతక వ్యాధులకు వాహకాలు

దోమలతో డెంగీ, ఫైలేరియా, మలేరియా, చికున్‌గున్యా లాంటి జబ్బులు

అప్రమత్తతే శ్రీరామరక్ష

నేడు ప్రపంచ దోమల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement