● ఇబ్బంది పడుతున్న రోగులు
నెల్లూరు(అర్బన్): డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. బుధవారం కూడా నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు, పీజీ చేస్తున్న వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వీరికి పలువురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మద్దతు పలికారు. ఇప్పటి వరకు పరోక్షంగా మద్దతు పలుకుతున్న వీరు తొలిసారిగా నేరుగా జూడాలు చేస్తున్న ధర్నా శిబిరం వద్దకు వచ్చి మాట్లాడారు. సమ్మె న్యాయ సమ్మతమైందన్నారు. జూడాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్‌కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె ఆపే ప్రసక్తేలేదని , కొనసాగుతుందన్నారు.
వారిపై భారం
జూనియర్ డాక్టర్లు అన్ని రకాల అత్యవసర సేవ లు ఆపేసి సమ్మెలో పాల్గొనడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ డాక్టర్లు, నర్సులపై పనిభారం పెరిగింది. ఇదిలా ఉండగా సీనియర్ డాక్టర్లు సక్రమంగా రాకపోవడంతో జూడాలు చేసే వైద్యసేవలు నర్సులే చేస్తున్నారు. ఈ క్రమంలో రోగులకు సక్రమంగా సేవలందడం లేదు.


