● పేట్రేగిపోతున్న గ్రావెల్ మాఫియా
● స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో దర్జాగా దోపిడీ
● కావలి, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లో నిత్యం వందల టిప్పర్లలో గ్రావెల్, మట్టి అక్రమ రవాణా
● బిట్రగుంట పోలీస్‌స్టేషన్ ఎదుటే
విచ్చలవిడిగా తవ్వకాలు
● కావలిలో చెరువులను చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు
● ముత్తుకూరు మండలం పంటపాళెంలో గిరిజన భూముల్లో మట్టి తవ్వేస్తున్న వైనం
● కలిగిరి పెద్ద చెరువు, రావులకొల్లు
చెరువుల నుంచి ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ రవాణా
● చిల్లకూరు, కోట, చిట్టమూరు
మండలాల్లో చెరువుల్లో యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ దోచేస్తున్నారు
ముత్తుకూరు మండలం పంటపాళెంలో
యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్‌లో వేస్తూ..
ముత్తుకూరు(పొదలకూరు): అధికారాన్ని అడ్డుపెట్టుకొని పంటపాళెంలోని గిరిజనుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలను అధికార పార్టీ నేతలు కొద్ది రోజులుగా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దాదాపు 16 ఎకరాల మేర గిరిజనులు అనుభవిస్తున్న భూములకు ఆర్డీఓ పట్టాలున్నాయి. వీటిని విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. అయితే మట్టి తవ్వకాలను అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా చేపట్టి సమీపంలోని ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ట్రిప్పునకు రూ.12 వేల చొప్పున విక్రయిస్తున్నారు.
పట్టపగలే..
సీజేఎఫ్‌ఎస్ భూముల్లో పగలూ, రాత్రనే తేడా లేకుండా మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. చుట్టుపక్కల నూతనంగా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీలకు వీటిని పంపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వందల అడుగుల లోతు వరకు తవ్వడంతో భూగర్భ జలాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గుంతల్లో నీటిని తోడుతూ..
భారీ గుంతల్లో చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా తోడి ఆపై మట్టిని తరలిస్తున్నారు. ఈ ప్రభావంతో చుట్టుపక్కల వేరుశనగ పంటలను సాగు చేస్తున్న రైతులకు నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. నిలదీస్తే అక్రమ కేసులు పెడతారనే భయంతో పలువురు వెనుకంజేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో గ్రావెల్, మట్టి మాఫియా దోపిడీ అప్రతిహతంగా సాగుతోంది. గ్రావెల్ మాఫియాలకు స్థానిక ఎమ్మెల్యేల అండదండలు ఉండడంతో పేట్రేగిపోతున్నారు. ప్రధానంగా కావలి, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లో చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో రేయింబవళ్లు బరితెగించి యంత్రాలు పెట్టి గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపడుతున్నా.. కట్టడి చేయాల్సిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖలు మామూళ్లు దండుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో నిత్యం పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురితమవుతున్నా, ప్రసారమవుతున్నా అధికారులు ధృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా తవ్వేసి అక్రమంగా అమ్ముకుంటున్న మాఫియాకు వచ్చే రాబడిలో 10 శాతం అధికారులకు నెల మామూళ్లుగా ముట్టచెబుతుంటే.. 50 శాతం స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలుగా వెళ్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా కావలి నియోజకవర్గంలో కావలి, బోగోలు మండలాల్లో గ్రావెల్, మట్టి తవ్వకాల కేజీఎఫ్ తరహాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కావలి మండలంలోని కావలి పెద్ద చెరువు, రుద్రకోట, కొత్తపల్లి, ఆర్‌సీపాళెం, అడవిలక్ష్మీపురం, చెన్నాయపాళెం, తాళ్లపాళెం గ్రామాల్లో చెరువులను ప్రమాదకర స్థాయిలో గోతులు పెట్టి తవ్వేశారు. ఇక బోగోలు మండలంలోని కప్పరాళ్లతిప్ప, కొండబిట్రగుంట, ఉమామహేశ్వరపురం గ్రామాల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. చీకటి పడితే చాలు భారీ యంత్రాలు, టిప్పర్లతో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో గ్రావెల్‌ను కొల్లగొట్టేస్తూ రియల్‌ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తూ రూ.కోట్లు దోచేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేస్తున్నారు. బోగోలు మండలం నుంచి ఒక్కో గ్రావెల్ ట్రిప్పునకు దూరాన్ని బట్టి రూ.13 వేలు నుంచి రూ.17 వేల వరకు రోజుకు సుమారు 100 ట్రిప్పుల పైనే తోలుతూ మాఫియా దోచుకుంటుంది. గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణాపై స్థానిక ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించినా, ఆ ప్రదేశానికి వెళ్లినా చంపేస్తాం, దాడులు చేస్తాం. మా వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటూ చెలరేగిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. అందుకు తగినట్లుగానే రుద్రకోటలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ఫొటోలను తీసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టును బంధించి తీసుకెళ్లి చీకటి గదిలో నిర్బంధించి చితక్కొట్టిన విషయం విదితమే. పచ్చమాఫియా ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇటీవల గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కథనాలు రాసిన జర్నలిస్టులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా పోస్టులు పెట్టి వేధించే స్థాయికి చేరింది. దీనిపై జర్నలిస్టులు కావలి డీఎస్పీని కలిసి సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేయడం గమనార్హం. మరో జర్నలిస్టును పట్టుకెళ్లి కట్టేసి కొట్టమని.. కొందరిని పురమాయించిన వైనం కూడా వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ పరిణామాలతో అప్రమత్తమైన పోలీసులు రెండు రోజుల పాటు సదరు జర్నలిస్టును నీడలా వెంటాడినట్లు సమాచారం. ఈ రెండు ఘటనల వెనుక స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఉండడం విశేషం.
పోలీస్‌స్టేషన్ ముందే దందా
బోగోలు మండలంలో కప్పరాళ్లతిప్పలోని పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చీకటి పడగానే భారీ యంత్రాలు, పదుల సంఖ్యలో టిప్పర్లు గ్రావెల్ భూముల్లోకి దిగిపోతున్నాయి. అక్కడ తవ్విన గ్రావెల్‌ను ఆ పోలీస్‌స్టేషన్ మీదుగానే హైవే ఎక్కిపోతున్నా.. పోలీసు అధికారులు కన్నెత్తి చూసి కట్టడి చేసిన పాపాన పోవడం లేదు. ఈ గ్రావెల్ దందా వెనుక స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వీయ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోగోలు మండలంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీపై స్థానిక తహసీల్దార్ సైతం అంగీకరించడం గమనార్హం.
సర్వేపల్లి నియోజకవర్గంలో నాణ్యమైన గ్రావెల్ వనరులు ఉన్న వెంకటాచలం జిల్లాలోనే అతి పెద్ద వీజీఎఫ్ (వెంకటాచలం గ్రావెల్ ఫీల్డ్స్)గా చెప్పొచ్చు. వెంకటాచలంలో గ్రావెల్ తవ్వకాలు చూస్తే.. కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో జరుగుతోంది. కానీ అధికార యంత్రాంగానికి మాత్రం కనిపించదు. ఇక పొదలకూరులో అయితే ఏకంగా కొండలనే కరిగించేశారు. ముత్తుకూరులో ఇప్పటికే చెరువుల్లో కుళ్లబొడిచేసిన ఈ మాఫియా చివరకు గిరిజనుల బతుకుదెరువు భూములను వదలట్లేదు.
ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి, కొండాపురం, వింజమూరు మండలాల్లో అక్రమ గ్రావెల్ దందా మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలనే తేడా లేకుండా అధికార పార్టీ నేతలు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు మామూళ్లు మత్తులో ‘పచ్చజెండా’ ఊపేశారు. కలిగిరి పెద్ద చెరువులో రేయింబవళ్లు యంత్రాలు పెట్టి 10 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారు. కలిగిరి మండలం రావులకొల్లు చెరువు నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ఓ రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తరలించి ఒక చోట నిల్వ చేస్తున్నారు.


