అక్రమ రవాణాతో జేబులు నింపుకొంటూ.. | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాతో జేబులు నింపుకొంటూ..

Aug 20 2026 12:11 AM | Updated on Aug 20 2026 12:11 AM

వింజమూరు (ఉదయగిరి): టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. దీనికి ఇరిగేషన్‌ అధికారుల సహకారం తోడవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లూ రవాణా చేస్తూ జేబులు నింపుకోవడంలో పచ్చ నేతలు బిజీబిజీగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి, కొండాపురం, వింజమూరు మండలాల్లో గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఫలితంగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి.

ప్రభుత్వ పనుల పేరుతో కొల్లగొడుతూ..

నిబంధనలకు విరుద్ధంగా కలిగిరి మండలంలోని రావులకొల్లు చెరువు నుంచి మట్టిని రోడ్డు కాంట్రాక్టర్‌ అక్రమంగా తరలించి ఓ చోట నిల్వ ఉంచుతున్నారు. అనుమతులు పొందామని చెప్తున్నా, అవి నామమాత్రంగా ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామావసరాల నిమిత్తం కొంత మొత్తంలో నగదు ఇచ్చే ఒప్పందంతో రవాణా సాగిస్తున్నారని తెలుస్తోంది. కలిగిరి పెద్ద చెరువు కట్ట అభివృద్ధి పేరుతో గ్రావెల్‌ను విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వింజమూరులో లేఅవుట్ల కోసం తరలిస్తున్నారు. దీని వెనుకా అధికార పార్టీ నేతల ప్రమేయముందని తెలుస్తోంది.

నిబంధనలు గాలికి

కలిగిరిలోని పెద్ద చెరువులో గ్రావెల్‌ అక్రమ దందా జోరుగా సాగుతోంది. పెద్ద మెషీన్లను వినియోగించి టిప్పర్ల ద్వారా తరలిస్తూ రూ.లక్షల్లో దోచేస్తున్నారు. ఈ క్రమంలో చెరువులో పదడుగుల లోతులో గుంతలు ఏర్పడ్డాయి. వర్షమొస్తే ఇందులో నీరు నిలిచి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం పొంచి ఉంది. ఈ దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత పాత్ర ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

కఠిన చర్యలు చేపడతాం

అనుమతుల్లేకుండా చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ను తరలిస్తే కఠన చర్యలు చేపడతాం. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. కలిగిరిలో అక్రమ రవాణా అంశం నా దృష్టికొచ్చింది. వీరిపై చర్యలు చేపట్టాలని సూచించాం. పెనాల్టీ రూపంలో నగదును వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తాం.

– దేశ్‌నాయక్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement