ముత్తుకూరు(పొదలకూరు): పౌరుల మధ్య శాంతి, మత సామరస్య సద్భావనను పెంపొందించాలని లోక్ అదాలత్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. మండలంలోని మల్లూరులో గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. సద్భావన దినోత్సవాన్ని ఏటా ఆగస్ట్ 20న నిర్వహిస్తున్నామని వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు న్యాయసేవాధికార సంస్థ ఉందని వివరించారు. అత్యవసర సమయాల్లో 15100 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. మానవ హక్కులు, చట్టాలపై వివరించారు. లోక్ అదాలత్ సభ్యులు సుబ్బారెడ్డి, నిరంజన్, కొండారెడ్డి, సుబ్బమ్మ, సుగుణ, రమేష్, వేణుగోపాల్, రమణయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.
29న వాహనాల వేలం
నెల్లూరు(టౌన్): రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సీజ్ చేసిన 25 వాహనాలను విడిపించుకునేందుకు ఇప్పటి వరకు ఎవరూ రాని తరుణంలో వీటిని ఈ నెల 29న వేలం వేయనున్నామని ఉప రవాణా కమిషనర్ చందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనాల నంబర్లు, మోడల్, తయారు చేసిన కంపెనీ వివరాలను తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉంచామని తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు తమ అడ్రస్ ప్రూఫ్‌తో పాటు రూ.ఐదు వేలను డిపాజిట్ చేయాలని సూచించారు. వేలంలో దక్కించుకున్న వారు సదరు మొత్తంతో పాటు 18 శాతం జీఎస్టీ, నిర్దేశిత పార్కింగ్ ఫీజును అదే రోజున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
వైఎస్సార్సీపీలో
పలువురికి పదవులు
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువుర్ని వివిధ హోదాల్లో నియమించారు. మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా ఖాజారహంతుల్లా, సోషల్ మీడియా సెక్రటరీగా సయ్యద్ జీషన్, జాయింట్ సెక్రటరీగా ఆవుల అనిల్‌కుమార్‌యాదవ్‌ను నియమిస్తూ ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం జారీ చేసింది.
గిరిజన యువతకు శిక్షణ
నెల్లూరు(వేదాయపాళెం): ఐటీడీఏ నెల్లూరు ప్రాజెక్ట్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించిన గిరిజన యువతకు మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణను నిర్వహించనున్నామని పీఓ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్ లేదా ఫెయిలైన అభ్యర్థులకు చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లి పోస్ట్ పేటమిట్టలోని అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 24 నెలల పాటు శిక్షణను ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఇంటర్ పాసైన వారికి 18 నెలల పాటు ట్రెయినింగ్‌ను నిర్వహించనున్నారని వివరించారు. స్టయ్‌పండ్ రూపంలో నెలకు రూ.13,192 నుంచి రూ.13,392 వరకు ఇవ్వనున్నారని వెల్లడించారు. 16 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి గల వారు కొండాయపాళెం గేట్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులను వచ్చే నెల 25లోపు సమర్పించాలని కోరారు. వివరాలకు 81878 99877 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
కిలో పొగాకు సరాసరి ధర రూ.186
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో గురువారం కిలో పొగాకుకు సరాసరి ధర రూ.186.02గా లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 633 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా, 536 బేళ్ల కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 97 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.110గా పలికిందన్నారు. వేలంలో పది కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
● మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో గురువారం 595 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 666 బేళ్లు రాగా, 595 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని తిరస్కరించినట్లు తెలియజేశారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.250 కాగా కనిష్ట ధర రూ.110 లభించింది. మొత్తమ్మీద సగటు ధర రూ.199.24గా నమోదైంది. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.


