● సంగం సబ్‌స్టేషన్ వద్ద కావలి
కాలువ అన్నదాతల బైఠాయింపు
సంగం: వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా అందడంలేదని ఆరోపిస్తూ కావలి కాలువ పరిధిలోని రైతులు.. సంగం సబ్‌స్టేషన్ వద్ద రోడ్డుపై గురువారం బైఠాయించి నిరసన చేపట్టారు. తొలుత ర్యాలీగా చేరుకొని విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోతల కారణంగా సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రకటించిన తొమ్మిది గంటల విద్యుత్‌ను సక్రమంగా అందించకుండా ఏకపక్షంగా కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో మూడు రోజులే సరఫరా చేసి, మిగిలిన నాలుగు రోజులు కోతలు విధిస్తే సాగు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సరఫరా అయ్యే వేళల్లోనూ అంతరాయాలు ఏర్పడుతుండటంతో మోటార్లు పనిచేయక సాగునీటిని పొలాలకు అందించలేకపోతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో సబ్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై భోజ్యానాయక్, బుచ్చిరెడ్డిపాళెం డీఈఈ సతీష్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. న్యాయం జరిగేలా ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. అధికారుల హామీతో ధర్నాను విరమించారు.


