దర్గా అభివృద్ధిలో విఫలం | - | Sakshi
Sakshi News home page

దర్గా అభివృద్ధిలో విఫలం

Aug 21 2026 12:16 AM | Updated on Aug 21 2026 12:16 AM

ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం: కసుమూరు దర్గా అభివృద్ధి, భక్తులకు వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో గురువారం నిర్వహించిన కంబల్‌ ఫాతేహాకు ఆయన హాజరయ్యారు. ముజావర్లు, ముస్లింలు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కసుమూరు దర్గాకు ఎంతో ప్రాశస్థ్యం ఉందని వివరించారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపిన అంశాన్ని ప్రస్తావించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కసుమూరు దర్గా అభివృద్ధికి ఎనలేని కృషి చేశామని వెల్లడించారు. భక్తులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో.. నిద్రించేందుకు, స్నానపు గదుల కోసం రూ.30 లక్షలను వెచ్చించి భవనాన్ని నిర్మించామని గుర్తుచేశారు. తాగునీటి వసతి, పారిశుధ్య సమస్య లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. తమ హయాంలో భక్తుల కోసం నిర్మించిన భవనాన్ని కూటమి ప్రభుత్వం కొలువుదీరాక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రంగా మార్చారని ఆరోపించారు. తమ పార్టీకి మంచి పేరొస్తుందనే భయంతో ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే కొత్త భవనాన్ని నిర్మించాలే తప్ప, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.

నిధులు పుష్కలంగా ఉన్నా..

వక్ఫ్‌బోర్డులో నిధులు పుష్కలంగా ఉన్నా, దర్గా అభివృద్ధిని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. భక్తులు, ప్రజలు చందాలేసుకొని కార్యక్రమాలను చేయాల్సి వస్తోందని తెలిపారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై సోమిరెడ్డికి లేదని విమర్శించారు. దర్గాను పట్టించుకోకపోవడంతో పారిశుధ్యం, తాగునీటి సమస్యతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్‌బోర్డు నిధుల దుర్వినియోగంపై తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి చర్యలు చేపడతామని చెప్పారు. మస్తాన్‌బాబా ఆశీస్సులు జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం లేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఎంపీటీసీ వడ్లమూడి ప్రభావతి, నేతలు చీకుర్తి నరసయ్య, కడివేటి శివ, దస్తగిరి, మహమ్మద్‌, బాబర్‌, మందా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement