● కాకాణి పూజిత
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా నేతలతో కలిసి విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. సుగాలి ప్రీతి మృతి చెంది తొమ్మిదేళ్లు గడిచినా, ఆమె కుటుంబానికి నేటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆమె తల్లి కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్‌చైర్‌లో శాంతియుతంగా యాత్ర చేపడితే, పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు శాంతియుతంగా పోరాడుతున్న మహిళను అడ్డుకోవడం కూటమి ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఈమె కుటుంబానికి న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. 80 మీటర్ల దూరంలోని ఇంటికెళ్లేందుకు సైతం సుగాలి ప్రీతి తల్లిని పోలీసులు అడ్డుకొని నోటీసులివ్వడం సమంజసం కాదన్నారు.
సీబీఐ విచారణపై వెనుకడుగెందుకు..?
సుగాలి ప్రీతి కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు, మెడికల్ రిపోర్టులు తదితర ఆధారాలపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 2017లో టీడీపీ హయాంలో ఈ ఘటన జరిగిందని, అప్పటి ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనంతో నేరస్తుల్లో భయం లేకుండాపోతోందని ఆరోపించారు. మహిళా డాక్టర్ ప్రియాంకకు జరిగిన ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పోలీసులను స్వతంత్రంగా పనిచేయనీయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రియాంక కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణను వేగవంతం చేయాలని కోరారు.
ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు
ప్రజలు లంచాలు తీసుకొని ఓట్లేశారంటూ సీఎం వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచాలు తీసుకున్నవారు, ఇచ్చిన వారు ఎవరనే విషయమై ఆధారాలుంటే బయటపెట్టాలని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్ల వంటి హామీల అమలుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
జగనన్న పాలనలోనే మహిళలకు భరోసా
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వైఎస్సార్ ఆసరా, చేయూత, అమ్మఒడి, జగనన్న తోడు, ఉచిత ఇళ్ల స్థలాలు వంటి పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మరల్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నేరస్తులకు భయం కలిగేలా కఠిన చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. మైక్ పట్టుకొని ప్రకటనలు చేయడం కాకుండా చేతల్లో చూపించాలన్నారు. మహిళల భద్రతపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జోనల్ మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, సిటీ అధ్యక్షురాలు ధనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


