ఇంజినీరింగ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ విద్యను అభ్యసిస్తే చాలు జీవితం సెటిలైపోతుందనే భావన విద్యార్థుల్లో ఉండేది. దీనికి తగిన విధంగానే రాష్ట్రంలోని కళాశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీపడేవారు. కౌన్సెలింగ్‌కు హాజరై తమకు నచ్చిన కాలేజీలో ప్రవేశాలు పొంది ఖుషీఖుషీగా ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వమొచ్చాక ఈ పరిస్థితంతా తారుమారైంది. ఇంటర్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 16న విడుదల చేయగా, ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్ రిజల్ట్స్ విడుదల్లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంది. ఫలితంగా విసిగి వేసారిపోయిన ఇక్కడి స్టూడెంట్స్ పక్క రాష్ట్రాల్లోని విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందారు. ఈ పరిణామం
రాష్ట్రంలోని కాలేజీల యాజమాన్యాలకు
అశనిపాతంలా పరిణమించింది.
తరలిపోతున్న
విద్యార్థులు
యాజమాన్యాలు
ఇంజినీరింగ్ సీట్లు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. సర్కార్ నియంతృత్వ పోకడలతో కాలేజీలను నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. వాస్తవానికి ఇంటర్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 16న విడుదల చేశారు. అదే సమయంలో ఏపీఈఏపీ సెట్‌ను మే 12 నుంచి 18 వరకు నిర్వహించారు. అయితే ఫలితాల విడుదల్లో అంతులేని జాప్యం చేసి చివరికి జూలై ఒకటిన వెల్లడించారు. ఈ పరిణామాల క్రమంలో రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో పాలుపోక అనేక మంది స్టూడెంట్స్ పక్క రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపారు.
ఏఐ రాకతో పరిస్థితి తలకిందులు
ప్రస్తుతం ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగం ఎప్పుడుంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్త వారికి కొలువు లభించడమూ కలగానే మారింది. ఫలితంగా విద్యార్థుల సంఖ్యా ఏటా తగ్గిపోతోంది. గతంలో జిల్లాలో 26 ఇంజినీరింగ్ కళాశాలలుంటే, ప్రస్తుతం ఈ సంఖ్య 13కు పతనమైంది. ఒక డీమ్డ్ యూనివర్సిటీ సైతం ఉంది. వివిధ బ్రాంచీల్లో కలిపి ఇందులో 10,147 సీట్లున్నాయి. తొలి విడతలో కేవలం 5275 మేరే భర్తీ అయ్యాయి. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు.
కళాశాలల వారీగా ఇదీ పరిస్థితి..
90 శాతానికిపైగా సీట్లు మూడు కళాశాలల్లోనే భర్తీ అయ్యాయి. రెండు కాలేజీల్లో అయితే పది శాతం కూడా ఫిల్ కాలేదు. తొలి విడత కౌన్సిలింగ్ అనంతరం కాలేజీల్లో ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తోంది. నారాయణ (నెల్లూరు)లో 99.56.. ఏఈసీఎన్‌లో 96.76.. నారాయణ (గూడూరు)లో 94.70.. ఆరెస్సార్‌లో 77.24.. గీతాంజలిలో 75.26.. వీఐటీకేలో 64.42.. ఎన్బీకేఆర్‌లో 56.43 శాతం మేర ప్రవేశాలు నమోదయ్యాయి. వీఎస్‌యూ ఈఎస్‌ఎఫ్‌లో 23.11.. ఎస్వీసీఎన్‌లో 22.31.. ఏఎస్‌ఈటీలో 22.22.. డీఎస్సైటీలో 16.04.. జీకేసీఎస్‌లో 9.72.. పీఆర్‌ఐకేలో 7.29 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఈసీఈకే సై..
ఇంజినీరింగ్‌లో ఈ విద్యాసంవత్సరంలో ఈసీఈ కోర్సులోనే ఎక్కువ మంది చేరుతున్నారు. తర్వాతి స్థానాలను సీఎస్‌ఈ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎమ్మెల్ తదితర బ్రాంచీలు ఆక్రమిస్తున్నాయి. ఈసీఈలో 1626కు గానూ 1246.. సీఎస్‌ఈలో 3690కు గానూ 1473.. ఏఐఎమ్మెల్‌లో 1696కు గానూ 1246.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్‌లో 882కు గానూ 354.. సివిల్ బ్రాంచీలో 312 సీట్లకు గానూ 112 మాత్రమే భర్తీ అయ్యాయి. ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈవీటీ, సీఎస్డీ తదితర బ్రాంచీల్లో అరకొరగా ప్రవేశాలు నమోదయ్యాయి. రెండో విడతలో ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ కాకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది.
లెక్కలు చూస్తే..
దిమ్మ తిరుగుతూ..
ఏపీఈఏపీ సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల పదితో ముగిసింది. జిల్లాలో తొలి విడతలో భర్తీ అయిన సీట్ల వివరాలను ఆన్‌లైన్లో గతంలో వెంటనే పెట్టేవారు. అయితే ఈసారి ఈ ప్రక్రియలోనూ జాప్యమే జరిగింది. చివరికి విడుదల చేసిన లెక్కలను పరిశీలిస్తే దిమ్మ తిరగడం కళాశాలల యాజమాన్యాల వంతైంది. జిల్లాలోని 13 ఇంజినీరింగ్ కాలేజీల్లో వివిధ బ్రాంచీల్లో 50 శాతం సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రెండో విడతలో ప్రవేశాలు పెద్దగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు యాజమాన్య కోటా 30 శాతం ఉండగా, అదీ ఫిల్ అయ్యే అవకాశమూ కానరావడంలేదు.
కంప్యూటర్ సైన్స్‌కు
క్రేజ్ తగ్గుతోంది
ఈ విద్యా సంవత్సరంలో ఈసీఈ కోర్సులో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఏఐ ప్రభావంతో కంప్యూటర్ సైన్స్‌పై అధిక శాతం మంది మొగ్గు చూపడంలేదు. రోబోటిక్, వీఎల్‌ఎస్సై కోర్సుల్లో చేరుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఇతర కోర్ బ్రాంచీలవైపు చూస్తున్నారు.
– భార్గవ్, ప్లేస్‌మెంట్ అధికారి
ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్
50 శాతం మేరే సీట్ల భర్తీ
అయోమయంలో యాజమాన్యాలు
రెండు కళాశాలల్లో పది పర్సంటే..
ఈసీఈ, సీఎస్‌ఈకే డిమాండ్
కౌన్సెలింగ్ ఆలస్యంతోనే ఈ పరిస్థితి..


