డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

ఆధారాలు చూపిస్తున్నా.. ప్రభుత్వం

స్పందించకపోవడం సిగ్గుచేటు

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అణిచేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. అవకతవకలపై ఆధారాలను చూపుతున్నా, వాటిపై సమాధానం చెప్పడంలేదని విమర్శించారు. తాము ప్రశ్నిస్తున్న అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అయితే ప్రభుత్వం అందుకు ముందుకు రాకుండా వివిధ అంశాలను తెరపైకి తెచ్చి దృష్టి మళ్లించే యత్నం చేస్తోందని మండిపడ్డారు. లోకేశ్‌ను కాపాడేందుకే రకరకాల డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలను తాము బయటపెడుతుంటే, గతంలో అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లను సర్కార్‌ పదేపదే ట్యాంపరింగ్‌ చేసిందన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై విచారణ జరపకుండా, ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. ఇప్పుడు సిట్‌ విచారణను తెరపైకి తీసుకురావడం డైవర్షన్‌ పాలిటిక్స్‌ కావానని ప్రశ్నించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వానికి దమ్ముంటే ఆదేశించాలని సవాల్‌ చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో నష్టపోయిన అభ్యర్థులు ఇప్పటికే గ్రీవెన్స్‌ విభాగానికి, శాప్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఉద్యోగాలను రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆడియోలూ వెలుగులోకి వచ్చాయన్నారు. పరీక్షలను నిర్వహించకుండా, నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన దొంగ జీఓల ఆధారంగా ఉద్యోగాలిచ్చారని ధ్వజమెత్తారు. సాఫ్ట్‌బాల్‌ చైర్మన్‌నగా ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 35 మందికి ఉద్యోగాలను ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సెక్రటరీ సంతకాలు చేయాల్సిన చోట చైర్మన్‌ హోదాలో ఎలా చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధం లేని టీచర్లతో ర్యాలీలెందుకు..?

స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు జరిగాయనే అంశంపైనే తాము ప్రశ్నిస్తున్నామని, అయితే దీంతో సంబంధం లేని ప్రొబేషన్లో ఉన్న ఉపాధ్యాయులతో ర్యాలీలను నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఎంఈఓలు, డీఈఓలను బెదిరించి వారి ద్వారా ఉపాధ్యాయులను బలవంతంగా ర్యాలీలకు తీసుకెళ్లారని ఆరోపించారు. ర్యాలీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, వీరి సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగుల బకాయిలను రూ.30 వేల కోట్లకు పెంచారన్నారు. పోలీస్‌ అధికారులకు జీతాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్‌ సమయంలోనూ గత ప్రభుత్వం 23 శాతం పీఆర్సీని ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి సర్కార్‌ ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లవుతున్నా.. ఐఆర్‌, పీఆర్సీని ఇవ్వలేదని.. ఈ విషయాన్ని ఉద్యోగులు గమనించాలని కోరారు. అనుమానాలకు సమాధానాలు చెప్పడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని అంశాలపై నిష్పక్షపాత విచారణను జరిపించాలని డిమాండ్‌ చేశారు.

నారాయణతో చర్చకు సిద్ధం

గత ప్రభుత్వ తీరుతో కేంద్ర నిధులను సైతం తెచ్చుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందంటూ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారని, వీటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. దేనిపై చర్చకొస్తారో చెప్తే తానూ సిద్ధమని సవాల్‌ విసిరారు.

ప్రశ్నించిన వారిపై కేసులా..?

అవకతవకలను ప్రశ్నిస్తూ వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న భయం తెలుస్తోందన్నారు. ఉద్యమాలను అణచేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. సర్వీస్‌లో ఉన్న తమకు టెట్‌ నుంచి మినహాయింపువ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 25 నుంచి 30 ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని ఇప్పుడు కొత్తగా టెట్‌ రాయాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement