తమిళనాడు బోటు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు బోటు పట్టివేత

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరుపాళెం సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన బోటును గస్తీ బృందం ఆదివారం పట్టుకుంది. కృష్ణపట్నం పోర్టుకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో బోటును గుర్తించి అడ్డుకున్నారు. దుగరాజపట్నం సీఎస్‌పీఎస్‌ ఎస్సై ఆంజనేయులు, వెంకటాచలం, మైరెన్‌ పోలీస్‌ సిబ్బంది, ఎఫ్డీఓ చిల్లకూరు శ్రీనివాసులు, వీఎఫ్‌ఏ రంజిత్‌, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా సముద్ర గస్తీ నిర్వహిస్తుండగా బోటును గుర్తించి పట్టుకున్నారు. ఇందులో తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులున్నారని గుర్తించారు. డ్రైవర్‌గా మేఘనాథ్‌ వ్యవహరిస్తున్నారని తెలిపారు. బోటును జువ్వలదిన్నె హార్బర్‌కు తరలించి సురక్షిత కస్టడీకి అప్పగించామని పేర్కొన్నారు.

నేటి నుంచి అత్యవసర వైద్యసేవలు బంద్‌

నెల్లూరు(అర్బన్‌): స్టయ్‌పండ్‌ను సవరించాలని కోరుతూ పలుమార్లు అర్జీలిచ్చి , ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర వైద్యసేవలను సోమవారం నుంచి నిలిపేయనున్నామని జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హనీష్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆగస్ట్‌ 15 సాయంత్రంలోపు లిఖితపూర్వకమైన హామీ లభిస్తుందని ఆశతో ఎదురుచూశామని, అయినా ప్రయోజనం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సమ్మెతో పెద్దాస్పత్రిలో ఇబ్బందులు

సాధారణ వైద్యసేవలను జూనియర్‌ డాక్టర్లు ఆరు రోజులుగా నిలిపేసి ఆందోళనలు చేస్తుండటంతో పెద్దాస్పత్రిలోని రోగులకు వైద్యసేవలు సకాలంలో అందడం లేదు. పలువురు సీనియర్‌ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ సేవలను నిలిపేస్తే ఆ ప్రభావం కాజ్యువాల్టీ, ఐసీయూ తదితర చోట్ల పడనుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఏమి జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి

22 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి.. ఆక్టోపస్‌ సర్కిల్‌ వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 90,293 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 53,090 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.6 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 22 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

విద్యార్థులకు మెరిట్‌ అవార్డులు

గూడూరు రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిరామిక్‌ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థి ప్రభాకర్‌రావు స్థాపించిన తల్లూరి చారిటబుల్‌ సంస్థ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. ప్రథమ సంవత్సర టాపర్‌ యశ్వంత్‌.. ద్వితీయ సంవత్సరం నుంచి ప్రతాప్‌.. డిప్లొమా నుంచి వినయ్‌కుమార్‌కు మెరిట్‌ అవార్డులను అందజేశారు. ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, హెచ్‌ఓడీ విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు సుబ్రహ్మణ్యం, జీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement