● సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి
వెంకటాచలం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నీతో పాటు నీ కొడుకు, అల్లుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలం, జంగాలపల్లి గ్రామాల్లో స్థానిక నేతలతో కలిసి ఆదివారం పర్యటించిన ఆయన మాట్లాడారు. వెంకటాచలంలోని జగనన్న కాలనీలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, గృహాలను తమ ప్రభుత్వ హయాంలో నిర్మించామని చెప్పారు. అయితే దీన్ని ఓర్వలేక అనర్హులకు ఇచ్చారంటూ ప్రచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు గోటిలో చిలుకగా మారిన విజిలెన్స్ శాఖ కాకుండా సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపడితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పారు. దీనికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనపై మోపిన కేసులపై సీబీఐ విచారణ జరపాలంటే, నిజం బయటపడుతుందనే ఉద్దేశంతో దీనికి ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. తనకు దమ్ముంది కాబట్టే, సీబీఐ విచారణను కోరానన్నారు. సోమిరెడ్డి కుటుంబం తరహాలో తీవ్ర అవినీతికి పాల్పడుతూ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలేసే నీచ మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు.
పారిపోతున్నారు..
సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతి విషయాలపై బహిరంగ చర్చకు.. కాణిపాకం వినాయకుడి గుడి వద్ద ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరినా, సోమిరెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కందలపాడు, రామదాసుకండ్రిగ, నాగంభొట్లకండ్రిగ, వెంకటాచలం, కనుపూరు గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో నిలువెత్తు గుంతలతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని మండిపడ్డారు. ఇరిగేషన్లో దొంగ బిల్లులు.. ఇసుక, గ్రావెల్, మట్టి, క్వార్ట్‌జ్ అక్రమ తరలింపుతో కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర నీదికాదానని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ రేట్లను ప్రభుత్వం పెంచిన తరహాలో.. సర్వేపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల మేర సోమిరెడ్డి అల్లుడు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.


