వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండల పరిషత్ ప్రాంగణంలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయకపోవడం చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా మండల విద్యావనరుల కేంద్రం, హౌసింగ్, ఉద్యానశాఖ, వీబీజీ రామ్ జీ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ చేయలేదు. కనీసం ఆయాశాఖల అధికారులు, ఉద్యోగులు శనివారం కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేకపోవడంతో వీరి తీరుపై సోషల్ మీడియా గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై ఆయా కార్యాలయాల అధికారులను సంప్రదించగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉండడంతో ఎంపీడీఓలో ఆవిష్కరించారని, అందుకే మా కార్యాలయాల్లో ప్రత్యేకంగా జాతీయ జెండాను ఎగుర వేయలేదని తెలిపారు. అయితే అదే ప్రాంగణంలో ఉన్న ఐకేపీ పొదుపు కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాల్సి ఉన్నా.. అధికారుల ఉదాసీన వైఖరితో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,699 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,884 మంది భక్తులు తలనీలాలర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


