నెల్లూరురూరల్: ప్రజలు అధికారమిచ్చింది.. దోచుకునేందుకే అనే విధంగా టీడీపీ నేతల తీరు ఉందని, ముఖ్యంగా నెల్లూరు నగర పాలక సంస్థను అడ్డం పెట్టుకుని మంత్రి నారాయణ రూ.కోట్ల అవినీతికి తెరతీశారని ఎమ్మెల్సీ, నెల్లూరు నగర ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే సహజ వనరులను దోచుకుంటున్నారు. కార్పొరేషన్ నిధులను దారి మళ్లించి లూటీ చేస్తున్నారు. తాజాగా నగర పాలక సంస్థ పరిధిలోని భూములను అప్పనంగా దోచుకునేందుకు స్కెచ్ వేస్తే.. ఇందుకు సంబంధిత కార్యాలయ అధికారులు, పాలక వర్గం కట్టబెట్టుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అవినీతి దోపిడీని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ బిట్–2 పరిధిలోని 1.40 సెంట్ల ప్రభుత్వ కాలువ స్థలాన్ని మంత్రి నారాయణ ఆక్రమించి కళాశాల నిర్మించారన్నారు. ఆయన పెద్ద మనసు చేసుకొని కార్పొరేషన్‌కు మార్కెట్ వాల్యూ కడతానని లేఖ రాస్తే, అదే మహద్భాగ్యమన్నట్టు కార్పొరేషన్ అధికారులు అంగీకరించి కౌన్సిల్ సమావేశంలో ఆమోదించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం దారుణమన్నారు. కాలువలో నీళ్లు లేవనే కారణంతో ప్రభుత్వ కాలువ స్థలాన్ని అప్పనంగా ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. చట్టాలను ఉల్లంఘించి మార్కెట్ వాల్యూ కడతానంటే అంగీకరించేందుకు అధికారులకు, పాలకవర్గాలకు అధికారం లేదన్నారు.
పేదల ఇళ్లు.. దుకాణాలు కూల్చేస్తారు..
పేదలు బతుకుదెరువు కోసం సెంటు, రెండు సెంట్ల స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే.. అంకణం స్థలంలో దుకాణాలు పెట్టుకుంటే ఇదే కార్పొరేషన్ అధికారులు మానవత్వం మరిచి వాటిని కూల్చేస్తారని, అదే మంత్రి నారాయణకు సంబంధించిన ప్రైవేట్ సంస్థకు రూ.కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారని చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై నిబంధనలు ప్రయోగించే అధికారులు, పెద్దల విషయంలో, ప్రభుత్వ భూముల విషయంలో ఎందుకు అదే నిబంధనలు పాటించడం లేదని నిలదీశారు.
చెత్త సేకరణ నుంచి రోడ్ల వరకు..
అవినీతి ఆరోపణలు
గత ప్రభుత్వ హయాంలో ‘క్లీన్ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం చెత్త సేకరణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి ట్రాక్టర్లను నడుపుతున్నారని, తమకు నచ్చిన వారికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చెట్లు నాటడంలో ఎంత అవినీతి జరిగిందో మనందరికీ తెలుసన్నారు. పేదల నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్నారని, ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ అందుకు తగిన సేవలు అందడం లేదని విమర్శించారు. నాసిరకంగా రోడ్లు నిర్మించి కొంత కాలానికే అవి దెబ్బతిన్నాయని, తిరిగి అదే పనులకు టెండర్లు పిలిచి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ తమకు అనుకూలంగా వ్యవహరించేలా కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, మేయర్‌ను మార్చి తమకు ఇష్టమైన పనులు జరిపించుకుంటోందని కూడా ఆయన ఆరోపించారు.
గోవింద నామాలతో లోకేశే విమర్శలు
వెన్నుపోటు పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఎగ్గొట్టారని ఓ కార్యకర్త తన బాధను గోవింద నామాలతో వ్యక్తం చేస్తే, దానిని కూడా రాజకీయంగా చిత్రీకరించి తనపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి మంత్రి లోకేశే గోవింద నామాలతో బహిరంగ వేదికల్లోనే మాట్లాడారని గుర్తుచేశారు. ఆయనపై కేసు కట్టే ధైర్యం ఈ పోలీసులకు ఉందా? అని పశ్న్రించారు.
పేదోడు బతికేందుకు అంకణం స్థలం ఆక్రమిస్తే జేసీబీలతో ధ్వంసం
కార్పొరేట్ బడాబాబులకు రూ.కోట్ల స్థలాలు అప్పనంగా అప్పగింత
మంత్రి నారాయణకు 1.40 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు కార్పొరేషన్ అధికారులు ప్లాన్
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం


