నెల్లూరు(అర్బన్): రాజమండ్రిలో మెడికో డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ సోమవారం నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున మెడికోలు, జనవిజ్ఞాన వేదిక నాయకులు కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రియాంక హత్య దుర్మార్గమన్నారు. ఆమె హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కాళేషాబాషా, వేదిక ఆరోగ్యవిభాగం సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను, మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు కాపాడాలని, మహిళలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎండీ రషిక్, జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చలపతి, విజయకుమార్, సమతా విభాగం కన్వీనర్ విజయమ్మ, నగర కార్యదర్శి కృష్ణ, మెడికోలు అఖిల్, జీవనసాయి, భార్గవి, లావణ్య, బలరామ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.


