GT VS RR: నేటి మ్యాచ్‌లో గెలుపెవరిది.. ఆ స్టార్‌ బౌలర్‌ ఆందుబాటులో ఉంటాడా..? | Will Kagiso Rabada Play GT VS RR IPL 2025 Match Today | Sakshi
Sakshi News home page

GT VS RR: నేటి మ్యాచ్‌లో గెలుపెవరిది.. ఆ స్టార్‌ బౌలర్‌ ఆందుబాటులో ఉంటాడా..?

Apr 9 2025 6:51 PM | Updated on Apr 9 2025 6:58 PM

Will Kagiso Rabada Play GT VS RR IPL 2025 Match Today

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టాటాన్స్‌ తమ సొంత మైదానంలో (నరేంద్ర మోదీ స్టేడియం) రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌కు గుజరాత్‌ స్టార్‌ పేసర్‌ కగిసో రబాడ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. రబాడ గత మ్యాచ్‌కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిపోయాడు. 

రబాడ ఎప్పుడు తిరిగొస్తాడనే దానిపై టైటాన్స్‌ యాజమాన్యం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. దీన్ని బట్టి చూస్తే అతను నేటి మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తుంది. రబాడ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 10.38 ఎకానమీతో కేవలం రెండే వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది అతని స్థాయి కాదు. 

ఈ సీజన్‌లో రబాడతో పాటు మరో స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం​ లేదు. రషీద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. అయినా గుజరాత్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. రబాడ, రషీద్‌ ఖాన్‌ విఫలమవుతున్న వేల సిరాజ్‌, సాయి సుదర్శన్‌ చెలరేగిపోతున్నారు. రబాడ, రషీద్‌ వైఫల్యాలను ఈ ఇద్దరూ భర్తీ చేస్తున్నారు. 

గుజరాత్‌ గెలిచిన మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు కీలకపాత్రలు పోషించారు. సిరాజ్‌ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్‌ కూడా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తున్నాడు. మరో పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. 

ప్రసిద్ద్‌ కూడా ఓ మ్యాచ్‌లో తన జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ప్రసిద్ద్‌, సిరాజ్‌ చెలరేగడంతో గుజరాత్‌ వరుసగా ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ, సన్‌రైజర్స్‌పై అద్భుత విజయాలు సాధించింది. మరోవైపు బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌, జోస్‌ బట్లర్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ కూడా సత్తా చాటుతున్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పాడు. 

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి (పంజాబ్‌) తర్వాత గుజరాత్‌ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడుతున్నారు. బౌలర్లు, బ్యాటర్లు సమాంతరంగా రాణిస్తూ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయారు. రాజస్థాన్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో కూడా విన్నింగ్‌ రన్‌ను కొనసాగించాలని గుజరాత్‌ భావిస్తుంది. ఈ జట్టుకు హోం గ్రౌండ్‌లో ఆడటం​ కూడా అడ్వాంటేజ్‌ అవుతుంది. 

మరోవైపు రాజస్థాన్‌ ఈ సీజన్‌లో రెండు వరుస ఓటముల తర్వాత రెండు వరుస విజయాలు సాధించి గెలుపు ట్రాక్‌ ఎక్కింది. గత మ్యాచ్‌లో ఈ జట్టు పటిష్టమైన పంజాబ్‌కు ఊహించని షాకిచ్చింది. రాయల్స్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌, కేకేఆర్‌ చేతుల్లో ఓడి, ఆతర్వాత సీఎస్‌కే, పంజాబ్‌పై విజయాలు సాధించింది. తొలి మూడు మ్యాచ్‌లో ఫామ్‌ ప్రదర్శించలేకపోయిన యశస్వి జైస్వాల్‌ చివరి మ్యాచ్‌లో టచ్‌లోకి రావడం రాయల్స్‌కు శుభపరిమాణం. కెప్టెన్‌ సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌ ఇప్పటికే పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. 

నితీశ్‌ రాణా కూడా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. హెట్‌మైర్‌, ధృవ్‌ జురెల్‌ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. బౌలింగ్‌లో హసరంగ, సందీప్‌ శర్మ, తీక్షణ పర్వాలేదనిపిస్తుండగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన జోఫ్రా ఆర్చర్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో అద్బుతంగా రాణించాడు. ఆర్చర్‌ గత మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

తుది జట్లు (అంచనా)..

గుజరాత్‌: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్‌), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, R. సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, షెర్ఫే రూథర్‌ఫోర్డ్.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌ & వికెట్‌కీపర్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే/కుమార్ కార్తికేయ‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement