
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో పాకిస్తాన్ (WI vs PAK) ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 202 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా కరేబియన్లు 2-1తో సిరీస్ గెలిచి.. 34 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్‌పై జయకేతనం ఎగురవేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఘోర వైఫల్యంపై అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆఖరి వన్డేలో దారుణంగా అవుటైన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది.
షాయీ హోప్ విధ్వంసకర అజేయ శతకం
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. కెప్టెన్ షాయీ హోప్ (94 బంతుల్లో 120 నాటౌట్) విధ్వంసకర అజేయ శతకంతో పాటు.. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 36), జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 నాటౌట్) మెరుపుల కారణంగా విండీస్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
కుప్పకూలిన టాపార్డర్
పాక్ బౌలర్లలో నసీం షా, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జేడన్ సీల్స్ ధాటికి ఓపెనర్లు సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 9 పరుగులకే నిష్క్రమించాడు.
బిక్కముఖం వేసిన రిజ్వాన్
ఆ తర్వాత కూడా జేడన్ సీల్స్ తన వికెట్ల వేట కొనసాగించాడు. అబ్దుల్లా షఫీక్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. జేడన్ సీల్స్ సంధించిన ఇన్-స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన రిజ్వాన్.. బంతిని వదిలేశాడు. దీంతో అది అనూహ్య రీతిలో స్టంప్స్ పైభాగానికి తాకగా.. ఊహించని పరిణామంతో రిజ్వాన్ బిక్కముఖం వేశాడు.
మరీ ఇంత చెత్తగా అవుటవుతారా?
తన బంతిని అంచనా వేయడంలో విఫలమై డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ ఏడాది మొత్తంలో ఇంత చెత్తగా బాల్‌ను వదిలేసిన ఆటగాడివి నువ్వే’’ అంటూ రిజ్వాన్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు.. ‘ఇక రిటైర్ అయిపో’ అంటూ బాబర్ ఆజంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్‌లో సల్మాన్ ఆఘా (30), మహ్మద్ నవాజ్ (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29.2 ఓవర్లలో 92 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలింది.
విండీస్ బౌలర్లలో ఆరు వికెట్లతో చెలరేగిన జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. గుడకేశ్ మోటి రెండు, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్‌కు వెళ్లిన పాకిస్తాన్ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుని.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.
చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్
Maulana Rizwan first ball Duck😭😭😭Imagine getting owned by West Indies and still dreaming about beating India pic.twitter.com/TzV2sp5Cnn
— A (@chadniket) August 12, 2025