IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా? | Why KL Rahul Kuldeep Yadav Are Not Playing IND vs AFG 3rd ODI | Sakshi
Sakshi News home page

IND vs AFG 3rd ODI: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

Jun 20 2026 2:21 PM | Updated on Jun 20 2026 2:51 PM

Why KL Rahul Kuldeep Yadav Are Not Playing IND vs AFG 3rd ODI

కేఎల్‌ రాహుల్‌ (PC: X)

అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో భారత్‌ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. తొలి మ్యాచ్‌ సందర్భంగా ధర్మశాలలో అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ హర్ష్‌ దూబే.. రెండో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆడాడు.

రాహుల్‌ లేడు
అయితే, తాజాగా శనివారం నాటి మూడో మ్యాచ్‌లో కుల్దీప్‌ స్థానాన్ని హర్ష్‌ తిరిగి భర్తీ చేశాడు. ఇక మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు బదులు.. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుదిజట్టులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి నుంచి కోలుకున్న అతడి కోసం రాహుల్‌ తప్పుకోవాల్సి వచ్చింది.

అదే విధంగా.. పేస్‌ దళంలో కీలకమైన అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో ప్రసిద్‌ కృష్ణకు చోటు దక్కింది. అయితే, ఈ మూడు మార్పులు చేయడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నలకు.. మ్యాచ్‌కు ముందే టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే పరోక్షంగా సమాధానమిచ్చాడు.

బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్‌
డష్కాటే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్‌ మ్యాచ్‌కూ తుదిజట్టులో మార్పులు చేస్తున్నాం. ఈసారి అర్ష్‌దీప్‌ సింగ్‌కు విశ్రాంతినిస్తున్నాం. బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్‌ ఇస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్‌లో డకౌట్‌ అయిన కేఎల్‌ రాహుల్‌ను మూడో వన్డేలో పక్కనపెట్టడం గమనార్హం.

మరోవైపు.. గత మ్యాచ్‌లో పది ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన కుల్దీప్‌ యాదవ్‌ కూడా మూడో వన్డే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రాహుల్‌, కుల్దీప్‌లపై వేటు వేయడం గాకుండా.. అర్ష్‌దీప్‌తో కలిసి వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు డష్కాటే వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

2-0తో సిరీస్‌ కైవసం
ఇక ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా నామమాత్రపు మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించే క్రమంలో యాజమాన్యం ఈ  నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గా చెన్నై వేదికగా మూడో వన్డేలో టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

చదవండి: వైభవ్‌ను టార్గెట్‌ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్‌ ఏమన్నాడంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement