FIFA WC 2026: మెస్సీ వ‌ర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే! | When-Lionel Messi-Cristiano Ronaldo Face-Each-Other-FIFA WC 2026 | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: దశాబ్దాల నిరీక్షణకు తెర.. మెస్సీ వ‌ర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే!

Jun 12 2026 3:30 PM | Updated on Jun 12 2026 4:07 PM

When-Lionel Messi-Cristiano Ronaldo Face-Each-Other-FIFA WC 2026

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. నెల‌రోజుల‌కు పైగా సాగ‌నున్న‌ సాక‌ర్ సంగ్రామంలో ఎన్ని అద్భుతాలు చోటు చేసుకున్నా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల క‌ళ్ల‌న్నీ ఇద్ద‌రి దిగ్గ‌జాల‌పైనే ఉంటాయి. ఆ ఇద్ద‌రు బ‌రిలోకి దిగారంటే ప్ర‌పంచం మొత్తం కన్నార్ప‌కుండా చూస్తోంది. మ‌రి అలాంటి ఇద్ద‌రు దిగ్గ‌జాలు ఫిఫా వంటి మేటి టోర్నీలో ప్ర‌త్య‌ర్థులుగా ఎదురుప‌డితే రికార్డులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే. 

ఆ ఇద్ద‌రిలో ఒక‌రు అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ అయితే..మ‌రొక‌రు పోర్చుగ‌ల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. రెండు ద‌శాబ్దాలుగా ఫుట్‌బాల్‌ను ఏలుతున్న ఈ ఇద్ద‌రికి ఇది ఆరో ప్ర‌పంచ‌క‌ప్ కావ‌డం విశేషం. ఈసారి జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ మెస్సీకి, రొనాల్డోకు చివ‌రిద‌ని ప్రచారం కూడా జ‌రుగుతోంది. అయితే ఫుట్‌బాల్ క్ల‌బ్స్ త‌ర‌ఫున‌ ఎన్నోసార్లు ఎదురుప‌డిన‌ప్ప‌టికీ, ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మాత్రం త‌మ జాతీయ జ‌ట్ల త‌ర‌ఫున ఈ ఇద్ద‌రు ఎదురుప‌డ‌లేదంటే న‌మ్ముతారా? కానీ ఇది అక్ష‌రాల నిజం.

అయితే 2026 ప్రపంచకప్‌లో మాత్రం ఇది సాధ్య‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్-జెలో అల్జీరి యా, ఆస్ట్రియా, జోర్డాన్ల‌తో కలిసి ఉంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జూన్ 16న అల్జీరియాతో, జూన్ 22న ఆస్ట్రియాతో, జూన్ 27న జోర్డాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. అర్జెంటీనా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే జూలై 4న జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-హెచ్ రన్న‌ర‌ప్‌తో తలపడుతుంది.

ఈసారైనా?
మరోవైపు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ గ్రూప్-కేలో ఉంది. ఇదే గ్రూప్‌లో పోర్చుగ‌ల్‌తో పాటు కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా కూడా ఉన్నాయి. పోర్చుగల్ జూన్ 17న కాంగోతో, జూన్ 23న ఉజ్బెకిస్తాన్‌తో, జూన్ 27న కొలంబియాతో తలపడనుంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిస్తే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 32లో మరో గ్రూప్ నుంచి వచ్చిన జట్టుతో ఆడుతుంది.

అన్నీ కుదిరితే క్వార్ట‌ర్స్‌లోనే..
ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మెస్సీ, రొనాల్డోలు ఎదురుపడాలంటే అర్జెంటీనా, పోర్చుగల్ రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌ల‌ను కూడా గెలవాలి. అలా జరిగితేనే క్వార్టర్ ఫైనల్లో ఈ దిగ్గజాలు ప్రత్యక్ష పోరుకు దిగే అవకాశం ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ దిగ్గ‌జాలు ఎదురుప‌డితే చూడాల‌ని వేచి చూస్తున్న అభిమానుల క‌ల కూడా నెరవేర‌నుంది. ఇది నిజ‌మైతే మాత్రం ఫిఫా చ‌రిత్ర‌లోనే అద్భుత ఘట్టంగా నిలిచిపోనుండ‌డంతో పాటు టీఆర్పీ రేట్ కూడా ప‌గిలిపోవ‌డం ఖాయం.

ఇద్దరూ ఇద్దరే!
ఆట ప‌రంగా చూసుకుంటే ఈ ఇద్ద‌రిని ఒక‌రితో ఒక‌రిని పోల్చ‌లేం. ఇద్ద‌రు దిగ్గ‌జాలు అభిమానుల గుండెల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ముద్రించుకున్నారు. అయితే 2022లో కోపా అమెరికా క‌ప్‌తో పాటు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ కైవ‌సం చేసుకున్న అర్జెంటీనాకు మెస్సీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విష‌యంలో మాత్రం రొనాల్డోతో పోలిస్తే మెస్సీ ఒక మెట్టు పైనే ఉంటాడు.

రికార్డుల్లో మెస్సీదే పైచేయి
రికార్డులు ప‌రిశీలించి చూస్తే.. రొనాల్డోపై మెస్సీదే పైచేయి. ఇప్పటికే ప్రపంచకప్‌లో మెస్సీ 26 మ్యాచ్‌లు (అత్యధిక మ్యాచ్‌లు), అత్యధిక నిమిషాలు (2,314) ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అర్జెంటీనా తరఫున మెస్సీ ప్రపంచకప్‌లో అత్యధికంగా 13 గోల్స్ సాధించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజే (16) రికార్డును అధిగమించడానికి మెస్సీకి మరో మూడు గోల్స్ మాత్రమే అవసరం. మరోవైపు రొనాల్డో తాను ఆడిన ఆరు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లు క‌లిపి 8 గోల్స్ మాత్రమే సాధించాడు. 

మెస్సీ రికార్డును అధిగమించాలంటే అతడు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే పోర్చుగల్ టోర్నీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం రొనాల్డోకు ఉంది. మెస్సీ, రొనాల్డోలు త‌ల‌ప‌డితే చూడాల‌ని మ‌న భార‌తీయులు కూడా వెయ్యిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. మైదానంలో కొద‌మ సింహాల్లా త‌ల‌ప‌డే ఈ ఇద్ద‌రి విన్యాసాల‌ను వీక్షించాలంటే అన్నీ సక్రమంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.

చదవండి: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement