PC: X
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026లో ఇండియా ఛాంపియన్స్ కథ ముగిసింది. మంగళవారం షార్జా వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఇండియా ఛాంపియన్స్ సెమీస్ చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్లు నమన్ ఓజా (0), అంబటి రాయుడు (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (4) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టాడు.
రిషి ధావన్ (34 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాబిన్ ఉతప్ప (19), పియూష్ చావ్లా (13) కాస్త పోరాడటంతో భారత జట్టు వంద దాటగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రయద్ ఎమ్రిట్ 2 వికెట్లు తీయగా, కార్లోస్ బ్రాత్‌వైట్, షెల్డన్ కాట్రెల్, నికితా మిల్లర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్ తలా ఒక వికెట్ సాధించారు.
చాడ్విక్ వాల్టన్ విధ్వంసం
అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. విండీస్ ఓపెనర్ చాడ్విక్ వాల్టన్( 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో దావల్ కులకర్ణి 2 వికెట్లు పడగొట్టగా, పియూష్ చావ్లా, రిషి ధావన్ తలా ఒక వికెట్ సాధించినా విండీస్ జోరును అడ్డుకోలేకపోయారు.


