విండీస్‌ ప్లేయర్‌ అరుదైన రికార్డు | West Indies Amir Jangoo Joins Elite List After 3rd Consecutive Fifty Plus Score vs India | Sakshi
Sakshi News home page

విండీస్‌ ప్లేయర్‌ అరుదైన రికార్డు

Oct 4 2026 1:20 PM | Updated on Oct 4 2026 1:47 PM

West Indies Amir Jangoo Joins Elite List After 3rd Consecutive Fifty Plus Score vs India

source: X

భారత్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్‌ అమిర్‌ జాంగూ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 50కిపైగా స్కోర్లు చేసిన అతడు.. భారత్‌లో తొలి మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా స్కోర్లు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో జాంగూ తొలి వన్డేలో 58 (నాటౌట్‌) పరుగులు, రెండో వన్డేలో 114 పరుగులు, మూడో వన్డేలో67 పరుగులు చేశాడు.

భారత్‌లో తొలి మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా పరుగులు చేసిన బ్యాటర్లు
* నవ్‌జోత్ సింగ్ సిద్ధూ – భారత్, 1987
* మార్క్ వా – ఆస్ట్రేలియా, 1996
* మాథ్యూ హేడెన్ – ఆస్ట్రేలియా, 2001
* జేసన్ రాయ్ – ఇంగ్లండ్, 2017
* అమిర్ జాంగూ – వెస్టిండీస్, 2026

భారత్‌తో సిరీస్‌లో జాంగూ మూడు ఇన్నింగ్స్‌ల్లో 135​కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేసి, గిల్‌ (334) తర్వాత సిరీస్‌లో రెండో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

47 బంతుల్లో హాఫ్ సెంచరీ
మూడో వన్డేలో 352 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జాంగూ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్ షాయ్ హోప్‌తో కలిసి జట్టు గెలుపుకు పటిష్టమైన పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో జాంగూ కేవలం 47 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

అనూహ్య రనౌట్
వెస్టిండీస్ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంటున్న సమయంలో భారత్‌కు కీలక బ్రేక్ లభించింది. విరాట్ కోహ్లీ చేసిన చిన్నపాటి ఫీల్డింగ్ తప్పిదాన్ని ఉపయోగించుకుని సింగిల్ తీసేందుకు జాంగూ ప్రయత్నించాడు. అయితే హోప్‌తో సమన్వయం లోపించడంతో జాంగూ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు.

జాంగూ ఔటైనప్పటికీ హోప్‌ ఒంటరిపోరాటం చేసి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో విండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 1-2​కి తగ్గించింది. ఈ సిరీస్‌లో భారత్‌ గెలిచినా, విండీస్‌ ప్లేయర్లు ప్రదర్శించిన పోరాటపటిమ అందరినీ ఆకట్టుకుంది. 

ఇదీ చదవండి: శ్రమపడేలా చేశారు.. వెస్టిండీస్‌పై గంభీర్ ప్రశంసలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement