టీమిండియా చేతిలో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని పాకిస్తాన్ బ్యాటర్ హసన్ నవాజ్ అన్నాడు. పటిష్ట భారత జట్టును ఎదుర్కోవడం తేలికేమీ కాదని.. అయినప్పటికీ విజయం కోసం తాను శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నాడు. అయితే, చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని నవాజ్ విచారం వ్యక్తం చేశాడు.
మరోసారి భారత్‌కు స్వర్ణం
జపాన్ వేదికగా ఇటీవల ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నీ ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడ్డ సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో టీమిండియా 19 పరుగుల తేడాతో గెలిచి మరోసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడగా.. పాక్ రజతంతో సరిపెట్టుకుంది.
హసన్ నవాజ్ మెరుపులు వృథా
ఈ మ్యాచ్‌లో భారత్ విధించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సహచర ఆటగాళ్లంతా విఫలమైనప్పటికీ.. నాలుగో నంబర్ బ్యాటర్ హసన్ నవాజ్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. అయితే, శివం దూబే అద్భుత బంతితో అతడిని బోల్తా కొట్టించి.. సెంచరీకి దూరం చేయడంతో పాటు భారత్ విజయానికి బాటలు వేశాడు.
నా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాను
ఈ నేపథ్యంలో భారత్ చేతిలో ఓటమిపై హసన్ నవాజ్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తీవ్ర నిరాశకు లోనయ్యాను. నా మనసు గాయపడింది. ఇప్పటికీ నేను ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా. మేము కొన్ని చిన్న చిన్న తప్పులు చేశాము.
వాటి వల్లే ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఏదేమైనా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాను. మేము గెలుస్తామనే అనుకున్నా. కానీ ఆఖర్లో అలా జరిగిపోయింది. పరిస్థితికి తగ్గట్లుగానే నేను బ్యాటింగ్ చేశాను. బుమ్రాకు ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మా విజయం తథ్యమనే అనుకున్నా.
మేము తప్పులు చేస్తూనే ఉంటాము
కానీ అలా జరగలేదు. ఏదేమైనా కష్టకాలంలో జట్టు కోసం పరుగులు చేసి.. పోటీలోకి తీసుకురావడం నాకు సంతృప్తినిచ్చింది. మళ్లీ మ్యాచ్‌లు జరుగుతాయి. మేము తప్పులు చేస్తూనే ఉంటాము. అయితే, టీమిండియాను ఓడించాలంటే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకాస్త గొప్పగా ఆడాల్సి ఉంటుంది.
భారత్ నంబర్ వన్ టీమ్ అని అందరికీ తెలుసు. అలాంటి జట్టు మీద బాగా ఆడటం వల్ల నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది.’’ అని 24 ఏళ్ల హసన్ నవాజ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు 3 ఖరీదైన అపార్టుమెంట్లు కొన్న విరుష్క
If you're one of the rare sports fan who missed out on yesterday's Gold Medal Match between India & Pakistan, we've got you covered ✅ Watch the 20th Asian Games Aichi-Nagoya 2026 LIVE on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat
— Sony Sports Network (@SonySportsNetwk) October 4, 2026


