PC: Instagram
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ జోడీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దకాలంగా అన్యోన్యంగా కొనసాగుతూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్న విరుష్క.. పెట్టుబడులు పెట్టడంలోనూ ముందు వరుసలో ఉంటారు.
రూ. 44.1 కోట్లు
ఇప్పటికే ఎన్నో వ్యాపారాల్లో భాగమైన విరాట్- అనుష్క.. గురుగ్రామ్, అలీభాగ్‌లలో ఖరీదైన నివాస స్థలాలు కొనుగోలు చేశారు. తాజాగా ముంబైలోనూ ఈ జంట మూడు అపార్డుమెంట్లు కొన్నట్లు సమాచారం. వీటి మొత్తం విలువ రూ. 44.1 కోట్లు అని తెలుస్తోంది.
అనుష్క, ఆమె తల్లిదండ్రులు
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ముంబైలోని వెర్సోవా యారి రోడ్డులో గల ఓ ఖరీదైన భవన సముదాయంలో ఒకే ఫ్లోరులో ఈ మూడు అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో అనుష్క శర్మ సొంతంగా ఓ అపార్టుమెంటు కొనుగోలు చేయగా.. దాని పక్కనే ఉన్న అపార్టుమెంటును ఆమె తల్లిదండ్రులు సొంతం చేసుకున్నారు.
విరాట్‌తో కలిసి ఒకటి
అదే ఫ్లోరులో మరో అపార్టుమెంట్‌ను భర్త విరాట్‌తో కలిసి అనుష్క కొనుక్కుంది. క్రె మ్యాట్రిక్స్ అందించిన వివరాల ప్రకారం.. అనుష్క శర్మ తన విలాసవంతమైన అపార్టుమెంటు కోసం రూ. 14.9 కోట్లు ఖర్చు చేసింది. దీనిని జూలై 8, 2026లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆమె.. రూ. 74.48 లక్షల మేర స్టాంపు డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది.
విలాసవంతమైన నివాసం
ఇక అపార్టుమెంట్ మొత్తం విస్తీర్ణం దాదాపు 2153.7 చదరపు అడుగులు కాగా.. ఇందులో 2026 చదరపు అడుగులు కార్పెట్ ఏరియా ఉండగా.. 128 చదరపు అడుగుల విశాలమైన బాల్కనీ ఏరియా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. అనుష్క శర్మ తల్లిదండ్రులు ఆషిమా, అజయ్ కుమార్ శర్మ రూ. 10.91 కోట్లకు అపార్టుమెంట్ కొనుగోలు చేయగా.. దీని విస్తీర్ణం 1577 చదరపు అడుగులు అని సమాచారం.
ఇటీవలే ఐదెకరాల భూమి కొన్న విరుష్క
అదే విధంగా.. విరాట్- అనుష్క కలిసి రూ. 18.29 కోట్లతో అదే ఫ్లోరులోని మరో అపార్టుమెంట్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఈ ఏడాది జనవరిలో అలీభాగ్‌లోని జిరాద్ గ్రామంలో 5.19 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
అప్పట్లో అక్కడే ఎనిమిది ఎకరాలు
దీని ధర సుమారు రూ. 37.86 కోట్లు అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 13న రిజిస్ట్రేషన్ పూర్తి కాగా.. స్టాంపు డ్యూటీగా రూ. 2.27 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కాగా 2022లో అలీభాగ్‌లోనే విరుష్క జోడీ ఎనిమిది ఎకరాల భూమి కొని.. అక్కడ విలాసవంతమైన హాలీడే హోం నిర్మించుకున్న సంగతి తెలిసిందే.
లండన్‌లోనే నివాసం
కాగా దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న విరాట్- అనుష్క 2017లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. పిల్లల గోప్యత, రక్షణ కోసం విరాట్ కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటున్నారు.
అయితే, స్వదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. లండన్‌లోనూ వీరికి ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక విరాట్ కోహ్లి ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడగా.. అనుష్క శర్మ పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చింది.
చదవండి: పచ్చని ప్రకృతి నడుమ.. భారత క్రికెటర్ ఐదు బెడ్‌రూమ్‌ల విల్లా
ఆశ్రమ సందర్శనకు రూ. ఐదు కోట్లు?.. స్పందించిన కోహ్లి బృందం


