ఐపీఎల్‌లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.
తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్‌గా భావించి, నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు.
ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్‌లోనే (2025) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్‌లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి పలు మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.
గతేడాదే విప్రాజ్ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు.


