సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Sets New Record In List A Cricket, Check About His Records | Sakshi
Sakshi News home page

సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్‌ సూర్యవంశీ

Dec 22 2024 4:02 PM | Updated on Dec 22 2024 5:28 PM

Vaibhav Suryavanshi Sets New Record In List A Cricket

టీనేజీ సంచలనం, రాజస్థాన్‌ రాయల్స్‌ వండర్‌ కిడ్‌ వైభవ్‌ సూర్యవంశీ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల వైభవ్‌.. లిస్ట్-ఏ క్రికెట్‌ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ (బీహార్‌) ఈ ఘనత సాధించాడు. 

గతంలో ఈ రికార్డు అలీ అ‍క్బర్‌ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్‌-ఏ క్రికెట్‌లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్‌ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.

కాగా, వైభవ్‌ లిస్ట్‌-ఏ అరంగేట్రం ఊహించినంత సజావుగా సాగలేదు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్‌ ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ ప్రాతినిథ్యం వహించిన బీహార్‌ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన బీహార్‌ 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బిపిన్‌ సౌరభ్‌ (50), గనీ (48), ప్రబల్‌ ప్రతాప్‌ సింగ్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3, ఆర్యన్‌ పాండే, కుల్వంత్‌ కేజ్రోలియా తలో 2, వెంకటేశ్‌ అయ్యర్‌, కుమార్‌ కార్తికేయ తలో వికెట్‌ పడగొట్టారు.

197 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ హర్ష్‌ గావ్లి (83), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (55) అర్ద సెంచరీలతో రాణించి మధ్యప్రదేశ్‌ను గెలిపించారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement